మూడెకరాల పంపిణీకి కట్టుబడి ఉన్నాం

నల్లగొండ,జూన్‌15(జ‌నంసాక్షి): దళితులకు మూడెకరాల భూ పంపిణీలో ప్రభుత్వం చిత్తశుద్దిగా పనిచేస్తోందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. భూమిలేని ప్రతి పేద దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని  పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో భూమలు కొనుగోలుకు అదికారులు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గ్రామాన్ని యూనిట్‌గా చేసుకుని భూ పంపిణీ చేపడతామని, ఇందుకోసం భూమి విక్రయించేందుకు రైతుల్ని ఒప్పించేందుకు సంఘ నాయకులు కృషి చేయాలన్నారు. కొనుగోలు చేసే భూములకు ఎకరాకు రూ.2లక్షల నుంచి 7 లక్షల వరకు ధర చెల్లిస్తామని, అవసరమైతే రూ.10లక్షల వరకు చెల్లించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పిస్తానన్నారు. భూమి కొనుగోలు పథకం కింద భూ సేకరణకు అవసరమైన భూముల ఇచ్చేందుకు రైతులు  ముందుకు రావాలని  కోరారు. దళితులకు భూ పంపిణీ ద్వారా ప్రభుత్వం వారిని ఆదుకోవలని చూస్తోందని అన్నారు.  సిఎం కెసిఆర్‌ తెలంగాణ అభివృద్దికి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని అన్నారు. భూమి కోనుగోలు పథకం కింద గత బ్జడెట్‌లో ప్రభుత్వం వేయి కోట్లు కేటాయించగా రూ.224 కోట్లు కార్పొరేషన్‌కు వచ్చాయన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చెరువుల్లో పూడిక తీసి మట్టిని పొలాల్లో పోయించనుందని, తద్వారా పొలాలు సారావంతమైనవిగా తయారవుతాయన్నారు. అంతే కాకుండా చెరువులలో నీటి నిల్వలు పెరుగుతాయని, రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.  పాఠశాలల్లో విద్యార్థులకు మిషన్‌ కాకతీయపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వీరి ద్వారా ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. చెరువులలో నీటి నిల్వలు పెరిగిన తర్వాత చేపల పెంపకం, మొక్కల పెంపకం చేపడితే కొంత మందికి ఉపాధి కూడా దొరుకుతుందన్నారు.