మూడో పెళ్లికి సిద్ధమైన తండ్రి

– వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి కొడుకు నిరసన
సిరిసిల్ల, ఆగస్టు21 (జనంసాక్షి):   మూడో పెళ్లికి సిద్ధమైన తండ్రికి వ్యతిరేకంగా ఓ బాలుడు వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి ఆందోళనకు దిగాడు. ఎట్టకేలకు వాటర్‌ ట్యాంక్‌ పై నుంచి బాలుడి కిందకు దిగాడు. బాలుడు వాటర్‌ ట్యాంక్‌ పైకి ఎక్కాడని తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతనికి నచ్చజెప్పారు. న్యాయం చేస్తామని హావిూ ఇవ్వడంతో బాలుడు కిందకు దిగాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా విద్యానగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా విద్యానగర్‌కు చెందిన రామచంద్రం మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. తండ్రి చర్యను నిరసిస్తూ తనయుడు సందీప్‌ వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి నిరసన వ్యక్తం చేశాడు. తండ్రి మూడో పెళ్లి చేసుకుంటే తన చెల్లి బతుకు అన్యాయం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రామచంద్రం ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల ఆమె అతని వదలిపెట్టి వెళ్లింది. తర్వాత అతను మొదటి భార్యతో ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఆ మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అంతేకాకుండా తన పేరు విూద ఉన్న ఆస్తిని ఆ మహిళలకు ఇచ్చేందుకు రామచంద్రం  సిద్ధపడుతున్నక్రమంలో మొదటి భార్య కనకవ్వ, కుమారుడు సందీప్‌, కూతురు సంధ్య ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తండ్రి పేరు విూద ఆస్తిని తమకు ఇప్పించాలని కోరుతున్నారు. అతను చేసే పనులతో తమ పరువు పోతుందని, నష్టం జరుగుతుందని అంటున్నారు. భార్య, కుటుంబాన్ని మరిచిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలోనే రామచంద్రంపై కేసు నమోదు అయింది. మరోసారి అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.