మృత్యు మార్గంగా మారిన హైవే

అతి వేగమే కారణంగా ప్రమాదాలు
మృత్యువాత పడుతున్నా పట్టించుకోని అధికారులు
స్పీడ్‌ బ్రేకర్లు…ప్రమాద సూచికలు మృగ్యం
కర్నూలు,నవంబర్‌8 (జనం సాక్షి) : హైవే మృత్యుమార్గమైంది. హైవే ప్రమాదాలు జిల్లాలో మామూలయ్యాయి. జరిగినప్పుడు తప్ప మిగతా సమయాల్లో అధికారులు పట్టించుకోవడం లేదు. హైవేపై వేగం నియంత్రణ నిబంధనలు పాటించక పోవడమే దీనికి కారణం. దీంతో భద్రత లేమి స్పష్టంగా కనిపిస్తోంది. అంతులేని వేగంతో వాహనాలు దూసుకెళ్లి రోడ్డు పైన నెత్తురు చిందుతున్నాయి. రహదారి నిబంధనలేవీ అమలు కావడం లేదు. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తరచూ ఎక్కడో ఒక చోట ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘటన జరిగినప్పుడు తప్ప మళ్లీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. వెల్దుర్తి, డోన్‌, ప్యాపిలి ప్రాంతాల్లోని హైవేలో ఉన్న రహదారుల కూడళ్ల మలుపులు డేంజర్‌ జోన్లుగా మారిపోయాయి. జిల్లాలో 85 కిలోవిూటర్ల మేర ఎన్‌హెచ్‌-44 ఉంది. కర్నూలు నుంచి వెల్దుర్తి, డోన్‌, ప్యాపిలి విూదుగా పోదొడ్డి వరకు జిల్లా హైవే రహదారి ఉంది. ఈ ప్రాంతాల్లోని రహదారుల కూడళ్ల మలుపులు డేంజర్‌ జోన్లయ్యాయి. డోన్‌ పరిధిలో ఆరు హైవే కూడళ్లు ప్రమాదాల నిలయాలయ్యాయి. హైవేపై అతివేగంగా వాహనాలు దూసుకొస్తున్నాయి. ప్రమాద కారణం ఇదే. నిబంధనల ప్రకారం హైవేపై వాహనాల వేగం 80 కిలోవిూటర్లు మించరాదు. అయితే ఈ నిబంధనను వాహనాల డ్రైవర్లు అసలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు, వాహనాలు మితివిూరిన వేగంతో వస్తున్నాయి. శుక్రవారం ప్యాపిలిలోని సవిూపంలోని హైవేపై ట్రావెల్‌ బస్సు అతివేగంతో దూసుకరావడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హైవేపై వేగనియంత్రణ చేయాల్సిన ఎంవీఐ అధికారులు, హైవే అధికారులు మొద్దునిద్ర వీడటం లేదన్న విమర్శలున్నాయి. హైవేపై వాహనాల వేగాన్ని నియంత్రించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవలసివస్తోంది. హైవేలో గత ఏడాది నుంచి.. ఇప్పటి వరకు 124ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 86 మంది మృత్యుబారిన పడ్డారు. 120 మందికిపైగా గాయపడ్డారు.  హైవే అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. హైవేపై పాటించాల్సిన నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. హైవే మలుపుల వద్ద ప్రమాద సూచికబోర్డులు అసలు కనిపించడం లేదు. మలుపుల వద్ద వేగనియంత్రణ బోర్డులు అడ్రస్‌ లేవు. వీటికి తోడు హైవే జంక్షన్‌ల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు కూడా లేకపోవడంతో.. వాహనాలు వేగంగా దూసుకొస్తున్నాయి. అదే విధంగా హైవే జంక్షన్‌ల వద్ద తప్పనిసరిగా లైటింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. రాత్రిళ్లు హైవే జంక్షన్‌ల వద్ద లైటింగ్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.ప్రమాదాలు జరిగినప్పుడే హడావిడి చేసి ఆ తర్వాత వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.