మెదక్ లో 4, నర్సాపూర్ లో 1, తూప్రాన్ లో 2 గ్రూప్ -1 పరీక్ష కేంద్రాలు.
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈ నెల 16 న నిర్వహించే గ్రూప్-1 పరీక్షలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున చీఫ్ సూపరింటెండెంట్ లు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరీక్షలు పకడ్బందీగా, సజావుగా, ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ సూచించారు. బుధవారం గ్రూప్-1 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో టీఎస్.పిఎసిసి చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అధికారులు, చీఫ్ సూపెరింటెండెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్ష ఈ నెల 16న ఉదయం 10. 30 గంటల నుండి మధ్యాన్నం 1. 00 వరకు నిర్వహించే పరీక్షకు జిల్లాలో 3,312 అభ్యర్థులు హాజరు కానున్నారని, అందుకనుగుణంగా మెదక్ లో 4, నర్సాపూర్ లో ఒకటి, తోప్రాన్ లో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వం మొదటిసారిగా బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థులను నిశితంగా పరిశీలించి పరీక్ష కేంద్రాలకు అనుమతించాలని నిర్ణయించిందని అన్నారు. కాబట్టి అభ్యర్థులను ఉదయం 8. 30 గంటల నుండి పరీక్ష కేంద్రాలకు అనుమతించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, చరవాణిలకు, ఎగ్జామ్ ప్యాడ్ లకు అనుమతి లేదని అన్నారు. అదేవిధంగా షూ వేసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని హాల్ టికెట్ తో పాటు ఫోటో గుర్తింపుకై ఓటరు కార్డు,ఆధార్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి వెంట తీసుకురావాలని సూచించారు. ఆబ్జెక్టివ్ టైపు లో ఉండే పరీక్షకు ఓ. ఏం.ఆర్. షీట్ లో బ్లూ లేదా బ్లాక్ పెన్ తోనే వ్రాయవలసి ఉంటుందన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించవలసిన గురుతర భాద్యత చీఫ్ సూపరిండెంట్ లదేనని లయజన్ అధికారులతో సమన్వయము చేసుకుంటూ ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గదిలో కావలసిన ఫర్నీచర్, వెలుతురు ఉండేలా చూడాలని, మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో ఏ.యెన్.ఏం. తో పాటు ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, విద్యుత్లో అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను సునిశితంగా చెక్ చేసి పంపాలని, ఆ తరువాత బయోమెట్రిక్ ద్వారా చెక్ చేసి హల టికెట్ పై హోలోగ్రాం వేయాలని సూచించారు. నర్సాపూర్ బి.వి.ఆర్.ఐ.టి. లో సుమారు 1200 మంది అభ్యర్థులు పరీక్ష వ్రాయనున్నందున బస్టాండు నుండి పరీక్ష కేంద్రానికి బస్సులు నడపాలని ఆ కళాశాల యాజమాన్యానికి, ఆర్.టి.సి. అధికారులకు కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పొలిసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని పొలిసు అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, ఆర్.డి.ఓ.లు, సంబంధిత అధీకారులు, చీఫ్ సుపేరింటేడెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area