మెమన్‌ ఉరిశిక్షపె అసద్‌ ఫైర్‌

2
– మత ప్రాతిపదికన శిక్షలు

– పంజాబ్‌ ముఖ్యమంత్రి, రాజీవ్‌ హంతకులకు రాజకీయ పార్టీల మద్దతు

హైదరాబాద్‌,జులై 24(జనంసాక్షి):

ముంబై పేలుళ్ల కేసులో దోషిగా నిర్దారణ అయిన యాకుబ్‌ మెమెన్‌ కు ఉరిశిక్ష విధించడాన్ని, దానిని అమలు చేయడాన్ని హైదరాబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ తప్పు పట్టారు. ముస్లిం కాబట్టే అతనికి ఉరి శిక్ష అమలు చేస్తున్నారని అన్నారు. అతని పిటిషన్‌ పరిశీలించకుండా ఎలా శిక్ష అమలు చేస్తారని ఆయన అన్నారు. రాజివ్‌ గాంధీ హంతకులకు, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌ హంతకులను ఉరి శిక్షలకు పడకుండా ఆ రాష్ట్రాల రాజకీయ నేతలు అండగా ఉన్నారని,అందువల్లే వారికి యావజ్జీవిత ఖైదుగా మార్చారని అసద్‌ అన్నారు. మెమెన్‌ ముస్లిం మతస్థుడైనందునే అతనిని ఆదుకునే వారు లేకుండా పోయారని అన్నారు. ఉరిశిక్షలు మత ప్రాతిపాదికన కాకుండా నేరం ప్రాతిపదికగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అసద్‌ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపి సాక్షి మహారాజ్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మెమెన్‌ ఉరిని రాజకీయం చేయాలని అనుకుంటున్న ఒవైసీ కావాలని అనుకుంటే పాకిస్తాన్‌ వెళ్లవచ్చని ఆయన ద్వజమెత్తారు. 250 మంది అమాయకుల మరణానికి కారణమైన వ్యక్తికి సుప్రింకోర్టు కూడా ఉరిశిక్షను ఖరారు చేస్తే కూడా ఒవైసీ వ్యతిరేకిస్తారా అని ఆయన అన్నారు.ముస్లిం అయినందుకే ఉరి తీస్తున్నారన్న అసద్‌ వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఉగ్రవాదులకు మతాన్ని అంటగట్టడం ద్వారా దేశద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.