మేం అలా చెప్పలేదు
– సయిద్‌పై వస్తున్న వార్తలను ఖండించిన చైనా
బీజింగ్, మే24(జనం సాక్షి) : అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పాక్ ప్రధాని అబ్బాసీని కోరినట్లు వస్తున్న వార్తలను డ్రాగన్ తీవ్రంగా ఖండించింది. దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయ ప్రతినిధి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ వార్తలు షాక్‌కు గురిచేశాయి. సయీద్‌ను పాక్ నుంచి పశ్చిమ ఆసియా దేశాలకు తరలించమని జిన్‌పింగ్ అడిగినట్లు వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది సయీద్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికాతో పాటు భారత్ నుంచి పాక్‌పై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలోనే సయీద్‌ను పశ్చిమ ఆసియా దేశాలకు పంపించాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గత నెల పాక్ ప్రధాని అబ్బాసీతో
సమావేశమైనపుడు అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు దేశాధినేతలు దాదాపు అరగంట పాటు సయీద్ విషయం గురించి చర్చించినట్లు పలు ఆంగ్ల విూడియాలు కథనాలు ప్రచురించాయి. కానీ, వీటిని డ్రాగన్ తీవ్రంగా ఖండించింది. 2012లో సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. అంతేకాదు.. అతడిపై 5మిలియన్ల డాలర్ల రివార్డును ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సయీద్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికా ఇప్పటికే పలుమార్లు పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది.