మేడిగడ్డపై రహస్య రీడిజైన్‌..!?

` అలా ఎందుకు చేయాల్సివంచ్చిందనే కోణంలో విజిలెన్స్‌ విచారణ
` 15రోజుల్లో సమగ్ర నివేదిక
` ప్రతిపాదిత డిజైన్‌ కాకుండా ప్రాజెక్టులో మార్పు
` నిర్మాణం నాసీరకం.. నిర్వాహణా నామమాత్రం
` విజిలెన్స్‌ అధికారుల చేతుల్లో కీలక ఆధారాలు
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో గత ప్రభుత్వ నిర్వాకం ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్టు తెలుస్తోంది. ఆనకట్ట కుంగిన వ్యవహారంలో జరిగిన లోటుపాట్లపై విజిలెన్స్‌ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుండగా.. ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. అందులో ప్రతిపాదిత నిర్మాణం కాకుండా రీ డిజైన్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది. దీనిపై సమగ్ర వివరాలతో మరో రెండువారాల్లో నివేదిక సిద్ధం చేయనున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.
హైదరాబాద్‌, జనవరి 23 (జనంసాక్షి):విజిలెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రతన్‌ నాయకత్వంలో కొందరు నిపుణుల సాయంతో మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన ఫైళ్ళను అధ్యయనం చేశారు. అత్యంత నాసీరకంగా నిర్మాణం చేపట్టారని, నిర్వాహణ కూడా సరిగ్గా లేదని సదరు బృందం తేల్చినట్టు తెలిసింది. బ్యారేజి పునాదుల్లోనే అవినీతి జరిగిన కారణంగానే పిల్లర్లు కుంగిపోయినట్లు తేల్చారు. సుమారు రు. 4 వేల కోట్లతో నిర్మించిన బ్యారేజి నాలుగేళ్లు కాకుండానే పగుళ్లు ఏర్పడటంతో నీటి నిల్వకూడా చేయలేని పరిస్థితికి చేరింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు మరో 15 రోజుల్లో రిపోర్టు సిద్దం చేయనున్నట్లు విజిలెన్స్‌ అధికారులు వెల్లడిరచారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు సైతం సేకరించారు. బ్యారేజిలో ఏడో బ్లాక్‌లోని 20వ పియర్‌ ధ్వంసం కాగా ఎనిమిదో బ్లాక్‌లో పగుళ్లను అధికారులు గుర్తించారు. బ్యారేజీలో నీరు ఉండడంతో త్వరలో మిగిలిన పియర్స్‌ను కూడా పరిశీలిస్తామంటున్నారు. ఒక్కో పియర్‌ను రూ.50 కోట్లతో నిర్మించారని, వాటిని మళ్లీ నిర్మించడానికి రూ.65కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.
డిజైన్‌ ఎందుకు మర్చాల్సి వచ్చింది?
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ప్రతిపాదిత డిజైన్‌ కాకుండా రీడైజన్‌ చేశారనే కోణంలో విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. అందుకు కారణాలను అన్వేషిస్తూ డీపీఆర్‌ను పరిశీలిస్తున్నారు. బ్యారేజీ నిర్మాణంలో అధికారులు సీపేజ్‌, ప్రెజర్‌ కంట్రోల్‌ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తేలుస్తున్నారు. జాతీయ గుర్తింపు పొందిన నాణ్యత పరిశీలన ఇంజినీర్లతో పరీక్షలు చేయిస్తున్నారు. నిర్మాణానికి ఉపయోగించిన సిమెంటును కెమికల్‌ ఎనాసిస్‌ చేయించనున్నారు. దర్యాప్తులో భాగంగా కొందరు అధికారులను కూడా విజిలెన్స్‌ అధికారులు విచారిస్తున్నారు.
ప్రభుత్వం అడిగితే వివరాలు ఇస్తాం : విజిలెన్స్‌
ప్రభుత్వం సమాచారం అడిగితే అన్ని వివరాలు ఇస్తామని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ సమయంలో ఇతరులను బ్యారేజీ సమీపంలోకి ఎందుకు అనుమతించలేదో తెలియదని అధికారులు చెబుతున్నారు. నిర్మాణానికి ముందు భూమి స్థితి సహా మొత్తం 5 రకాల పరీక్షలు చేయాల్సి ఉండగా వాటిని సరిగా చేశారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నామన్నారు. గతంలో మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించగా.. ఏడో బ్లాక్‌తో పాటు 6, 8 బ్లాక్‌లలోని ఇతర పియర్స్‌కు నష్టం వచ్చిందని గుర్తించారు. డిజైన్‌తో పాటు నాణ్యత, నిర్వహణ లోపాలు ఉన్నట్లు అంచనాకు వచ్చారు. అనంతరం లోతైన అధ్యయనంలో భాగంగా జనవరి 9 నుంచి ప్రాజెక్టుపై ఫోకస్‌ చేశారు. అప్పటినుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. నష్టాలను, కారణాలను గుర్తించి నివేదికను రూపొందిస్తున్నారు.