మేమిద్దరం ఇప్పటికీ స్నేహితులమే!
హైదరాబాద్: టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ర్టేలియా ఆటగాళ్లు ఇకపై ఫ్రెండ్స్ కాబోరంటూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘాటుగానే మాట్లాడాడు. ఆ తర్వాత అందరూ కాదు కొందరే అని కూడా సవరించుకున్నాడు. అయితే.. ఐపీఎల్ మొదలైన నేపథ్యంలో ఇప్పుడు భారత, ఆసీస్ ఆటగాళ్లు కలిసి ఆడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ర్టేలియా ఓపెనర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పాడు. వార్నర్ టీమ్ సన్‌రైజర్స్, కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న బెంగళూరు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ సందర్భంగా తాము మాట్లాడుకున్నామని డేవిడ్ చెప్పా డు. ‘నేను విరాట్‌తో మాట్లాడాను. మా ఇద్దరి మధ్య చక్కటి సంభాషణ సాగింది. మేమిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమేన’ని వార్నర్ చెప్పాడు. మ్యాచ్ సందర్భంగా మైదానంలో కొన్ని విషయాల్లో చాలా సీరియ్‌సగా ఉంటామని.. ఆ తర్వాత అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. ‘ప్రపంచ క్రికెట్, ప్రత్యేకించి ఐపీఎల్‌లో స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. మనమిక్కడ ఆటను ప్రేమించాలి. ఆటను ఆస్వాదించడంలోనే ఆనందం ఉంటుంద’ని వార్నర్ తెలిపాడు.