మైదానంలో నిద్రపోయిన ధోని
క్యాండీ: ఓవైపు తమ టీమ్ ఓడిపోతున్నదని శ్రీలంక అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఇదేం ఆట అంటూ ప్లేయర్స్‌పై బాటిల్స్ విసిరి నిరసన తెలుపుతున్నారు. అరగంటకుపైగా ఆట నిలిచిపోయింది. కానీ మన మిస్టర్ కూల్ ధోనీకి మాత్రం ఇవేమీ పట్టలేదు. గ్రౌండ్‌లోనే హాయిగా కునుకు తీశాడు. టీమ్ మరో 8 పరుగులు చేస్తే చాలు గెలుస్తుందన్న సమయంలో లంక ఫ్యాన్స్ స్టేడియంలో బాటిల్స్ విసురుతూ మ్యాచ్‌కు అడ్డం పడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రోహిత్‌తో కలిసి క్రీజులో ఉన్నాడు ధోనీ. అప్పటికే 61 రన్స్ చేసి టీమ్‌ను విజయానికి చేరువ చేశాడు. కాసేపు నిలబడి రోహిత్‌తో మాట్లాడిన ధోనీ.. మరికాసేపు పిచ్‌పైనే కూర్చున్నాడు. మ్యాచ్ ఎంతకూ మొదలవకపోవడంతో ఇక లాభం లేదనుకొని ఓ కునుకు తీశాడు. అతన్ని చూసి కామెంటేటర్లు కూడా కాసేపు నవ్వుకున్నారు. ట్విట్టర్ కూడా ధోనీని చూసి తెగ జోకులేసుకుంటున్నది.