మొక్కల సంరక్షణలో అశ్రద్ధ చేస్తే కఠిన చర్యలు
— జెడ్పి సీఈవో విద్యాలత
టేకులపల్లి, ఆగస్టు 27( జనం సాక్షి ): హరితహారం లో భాగంగా నాటుతున్న ప్రతి మొక్కను సంరక్షించడంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీమతి విద్యాలత హెచ్చరించారు. శనివారం టేకులపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంత పనులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీడీవో డి బాలరాజుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు, రోడ్డు కిరువైపుల మొక్కల పెంపకం పనులను నాణ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. జడ్పీ సీఈఓ వెంట మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి.బాలరాజు , మండల పంచాయత్ అధికారి జే.లక్ష్మీగణేష్ గాంధీ పాల్గొన్నారు.