మొదలైన డీఎస్సీ కోలాహలం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 4  ప్రభుత్వం 2012 డీఎస్సీకి చెందిన జాబితాను విడుదల చేయడంతో అభ్యర్థుల్లో కోలాహలం నెలకొంది. వివిధ పోస్టుల ఎంపికకుగాను అభ్యర్థుల ధృవీకరణ పరిశీలన ప్రారంభమైంది. దీనికోసం కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యాశాఖాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మైదాన, గిరిజన ప్రాంత ఉపాధ్యాయ అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్‌ పర్యవేక్షణలో కొనసాగుతోంది. కాగా ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయుల పోస్టుల కోసం నకిలీ ధృవీకరణ పత్రాలు పొంది జాబితాలో ఎంపికైన వారి పేర్లను తొలగించాలని, గిరిజన ప్రాంత ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. కొంతమంది అధికారులకు లంచాలు ఇచ్చి ఏజెన్సీకి చెందిన నకిలీ ధృవీకరణ పత్రాలు పొంది జాబితాలో ఎంపికయ్యారని ఆరోపించారు. వెంటనే అనర్హులను తొలగించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.