మోడీ,షాల అధికార దుర్వినియోగం: గఫూర్‌

కర్నూలు,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో అధికారం దక్కించుకునేందుకు మోదీ, అమిత్‌ షా చేసిన కుయుక్తులు రాజకీయ వ్యవస్థకే మచ్చ తెచ్చాయని సిపిఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ అన్నారు.కేంద్ర ప్రభుత్వంలో నరేంద్రమోదీ, అమిత్‌షాల ద్వయం రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తోందని, అధికారం కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అడ్డదార్లు తొక్కుతున్నారని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోరు మెదపడంలేదని ఆయన మండిపడ్డారు. గవర్నర్‌ వ్యవస్థను చెప్పుచేతల్లో ఉంచుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమన్నారు. పొత్తులతో పోటీచేసి గెలుపొందిన పార్టీలకే అధికారం చేపట్టే విధానం ఉండాలని, ఎన్నికల అనంతరం చీలిపోయి ఇతర పార్టీలతో అధికారం చేపట్టేందుకు ప్రయత్నించడం సరైంది కాదన్నారు. రాజధానిలో ఎన్నో భవనాలు నిర్మించి నప్పటికీ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నిటినికూల్చడం ఎంత వరకు సబబన్నారు. చట్టాలు అమలు పర్చడంలో ప్రభుత్వాలు వెనుకంజ వేస్తున్నాయన్నారు.