మోడీ ప్రభుత్వం వివేకం లేని.. 

రాజకీయాలను వెంటనే ఆపాలి
– ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ ట్వీట్‌
న్యూఢిల్లీ, జులై12(జ‌నం సాక్షి) : మాజీ ఆప్‌ పార్టీ నేత యోగేంద్రయాదవ్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఖండిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ ఆయనకు మద్దతు పలికారు. మోడీ ప్రభుత్వం ఇటువంటి వివేకం లేని రాజకీయాల్ని వెంటనే నిలిపివేయాలని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, బుధవారం యోగేంద్ర బంధువుల ఆస్పత్రిపై ఐటి శాఖ అధికారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఐటి (ఆదాయపు పన్ను శాఖ)
వంటి ఏజన్సీలను ఉపయోగించి యోగేంద్ర కుటుంబంపై మోడీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు కేజీవ్రాల్‌ తెలిపారు. కాగా, యోగేంద్ర సోదరీమణులు హర్యానా లోనిర్వహిస్తున్న ఆసుపత్రిపై ఐటి అధికారులతో కేంద్ర ప్రభుత్వం దాడి చేయించినట్లు తెలిపారు. రైతులకు మద్దతుగా నిరసన ప్రదర్శనలో పాల్గన్నందుకు ప్రభుత్వం ఈ విధంగా దాడికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఐటి శాఖకుచెందిన 100మందికి పైగా అధికారులు ఆస్పత్రిపై దాడిచేశారని ఆయన పేర్కొన్నారు. ఐసియులో నవజాత శిశువులకు చికిత్సను అందిస్తుండగానే ఆస్పత్రిని సీజ్‌ చేశారని, భయపెట్టేందుకు ఇటువంటి ప్రయత్నం చేశారని పేర్కొంటూ మోడీ మౌనం వీడి ఈ చర్యపై సమాధానమివ్వాలని స్వరాజ్‌ అభియాన్‌ నేత తెలిపారు. కాగా, నీరవ్‌మోడీ సంస్థకు చెల్లించిన రూ.3.25 లక్షల కోసం ఐటి దాడులు చేసిందన్నారు. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ సంస్థ నుండి తాము ఆరు లక్షల రూపాయల నగలను కొనుగోలు చేశామని, దానికి సంబంధించి రూ.3.25 చెల్లించినట్లు యోగేంద్ర మేనల్లుడు గౌతమ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. అయితే సోదాలలో ఆస్పత్రి నుండి రూ.22 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటి అధికారులు తెలిపారు.
————————