మోదీజీ.. ఆలోచించి మాట్లాడండి!

– విూరు కేటాయించిన నిధులతో అభివృద్ధి అసలే సాధ్యంకాదు
– విూరిచ్చిన నిధుల డేటా చూసి మాట్లాడండి
– కర్ణాటక అభివృద్ధిలో కీలక భూమిక కాంగ్రెస్‌దే
– ట్విట్టర్‌లో మోదీపై విరుచుకుపడ్డ రాహుల్‌గాంధీ
బెంగళూరు, మే4(జ‌నం సాక్షి ) : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ గురువారం కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. సిలికాన్‌ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరును పాపాల లోయ(సిన్‌ వ్యాలీగా, ఉద్యానాలనగరి (గార్డెన్‌ సిటీ)ని చెత్త నగరం(గార్బేజ్‌ సిటీ)గా మార్చేశారని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. శుక్రవారం మోదీపై ట్వీట్ల దాడి చేశారు.
ప్రియమైన మోదీజీ… విూరు బెంగళూరును నేరాల నగరి అనీ, చెత్త నగరం అని సంబోధించి అవమానించారు. అబద్ధాలు చెప్పడం విూకు సహజంగానే అబ్బింది. కొంచెం ఆలోచించి మాట్లాడండి. కానీ కర్ణాటకలో నగరాలను అభివృద్ధి చేయడం.. విూరు అసత్యాలు చెప్పినంత సులభం కాదు. ఇన్నేళ్లలో విూరు కేటాయించిన నిధులతో నగరాల అభివృద్ధి అసలే సాధ్యం కాదు. అలాంటిది విూరిలా మాట్లాడటం సరికాదు. విూ మాటలు ఎంతమాత్రం నిజమో ఈ డేటా చూస్తే తెలుస్తోంది. విూకంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం 1100శాతం ఎక్కువ నిధులు కర్ణాటక నగరాల అభివృద్ధికి కేటాయించింది. కాంగ్రెస్‌ రూ.6,570కోట్లు కేటాయిస్తే.. భాజపా ప్రభుత్వం రూ.598కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇలాగైతే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది? కర్ణాటక రైతుల కోసం అన్నా భాగ్య, క్షీరధారె, కృషి యంత్ర ధారె, సూర్య రైతా పథకాలు అమలు చేశామని రాహుల్‌ పేర్కొన్నారు. రైతుల బాగుకోసం వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ నడవను సృష్టించబోతున్నాం.’ అని ట్వీట్‌ చేశారు. ఈ నెల 12న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇలాంటి అంశాలను అస్త్రాలుగా మార్చుకొని ఒక పార్టీపై మరోపార్టీ మాటల యుద్ధానికి దిగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు ఈనెల 15న వెలువడనున్నాయి.
—————————–