మోదీతో ములాయం మిలాఖత్
జనత పరివార్ నుంచి వెనక్కు
లక్నో, సెప్టంబర్ 3 (జనంసాక్షి) :ప్రధాని నరేంద్రమోడితో ములాయం సమావేశంమై వారం రోజులు గడవక ముందే జనతా పరివార్ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
పరిశీలకులు ఊహించినట్టుగానే యాదవ కుటుంబం చీలిపోయింది.ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో యూపీఏ మిత్ర పక్షాల ఆందోళనను తప్పుబట్టి మోడీని ములాయం సమర్ధిచినప్పుడే ఎదో జరుగబోతుందని అందరు ఊహించారు. అనుకున్నట్టు గానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోరాడాలని బయటకు చెబుతూనే సీట్ల పంపకం సమయంలో తనను సంప్రదించకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం మండిపడ్డారు. సిఎం నితీశ్, ఆర్జేడీ ఛీఫ్ లాలూలకు గట్టి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నారు. తనకు కేవలం ఐదు స్థానాలు కేటాయించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అందుకే లాలూ, నితీశ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఓడిపోయేలా పథకాలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని తేల్చేశారు. ములాయం నిర్ణయం బీహార్ బీజేపీపై పాలు పోసినట్లైంది. తమ విజయాన్నిక ఎవ్వరూ అడ్డుకోలేరని బీహార్ బిజెపి నేతలంటున్నారు. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది ఆఖరులోగా ఎన్నికలు జరగనున్నాయి. లాలూ, నితీశ్, సోనియా మహా కూటమిగా బరిలోకి దిగుతున్నారు. చెరి వంద సీట్లలో బరిలోకి దిగాలని ఆర్జేడీ, జెడీయూ నిర్ణయించాయి. ఎన్‌డియే పక్షాల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కుదరలేదు. ములాయం ఒంటరిగా పోరాడటం వల్ల ఓటు చీలుతుంది. ఓట్ల చీలిక వల్ల బిజెపి లబ్ది పొందుతుందని విశ్లేషకుల అంచనా. సరిగ్గా ఈ భయంతోటే ములాయంను బుజ్జగించి దారిలోకి తెచ్చుకుంటామని జెడియూ అధినేత శరద్ యాదవ్ చెబుతున్నారు. కానీ ఓ సారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ వెనకడుగు వేసేది లేదని ములాయం అంటున్నారు. బీహార్ ఓటర్ల మనసులో ఏముందో తేలాలంటే మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.