మోదీవి ఢాంభికాలు

5

– భారత్‌ 7.5 శాతం వృద్ధిరేటు సాధ్యంకాదు

– అమెరికా

వాషింగ్టన్‌,జులై 6(జనంసాక్షి): ఇన్నిరోజులు ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక సంస్కరణలను ఆకాశానికి ఎత్తుతూ వచ్చిన అగ్రరాజ్యం అమెరికా మాట మార్చింది. మోదీ చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు ఆశించిన రీతిలో లేవని తేల్చేసింది. భారత్‌ 7.5 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తామని మోదీ చెప్పడం అతిశయోక్తి అని వ్యాఖ్యానించింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ‘2016 పెట్టుబడుల వాతావరణ ప్రకటన’ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ఆర్థిక సంస్కరణల అమలులో మోదీ ప్రభుత్వం విఫలమవుతోందని.. జీఎస్టీ బిల్లుకు రాజకీయ మద్దతుపై ఇంకా చర్చల దశలోనే ఉందని తెలిపింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో భారత్‌ ఒకటిగా ఉంది. 7.5 శాతం వృద్ధి రేటు నమోదుచేస్తామని చూపించడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించింది. మోదీ చెబుతున్న రీతిలో ఆర్థిక సంస్కరణలు లేవని రిపోర్టులో పేర్కొంది. గొప్పలు చెప్పుకోవడం మినహా.. లక్ష్యాలను అధిగమించలేకపోతున్నారని తెలిపింది. అయితే విదేశీ పెట్టుబడుల నిబంధనల విషయంలో తీసుకున్న చర్యలు, పాలన ఫర్వాలేదని తన రిపోర్టులో పేర్కొంది. ఇతర ఆర్థిక సంస్కరణలతో పోలిస్తే మోదీ చేపట్టేవి చాలా నెమ్మదిగా ఉన్నాయని అమెరికా వ్యాఖ్యానించింది.