మోదీ ఆర్థిక విధానాలు దేశానికి క్షేమం కాదు

మండిపడ్డ మాజీ ప్రధాని మన్మోహన్‌
న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి):  ప్రధాని నరేంద్ర మోదీపై  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎదురుదాడికి దిగారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ ఇష్టం వచ్చినట్లు దేశాన్ని నడుపుతున్నదని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ విజయాలను మోదీ ప్రభుత్వం పూర్తిగా తిరోగమనంలోకి తీసుకెళ్లిందని ఆరోపించారు. ఇక మోదీపై వ్యక్తిగతంగా కూడా దాడి చేశారు. దేశంలో ఇప్పటివరకు ఏ ప్రధాని కూడా తన ప్రత్యర్థులపై ఇంత దారుణ వ్యాఖ్యలు చేయలేదు. ఓ ప్రధాని ఇంతలా దిగజారడం ఆయనకే కాదు దేశానికి కూడా మంచిది కాదు అని మన్మోహన్‌ స్పష్టంచేశారు. ఇక మోదీ సర్కార్‌ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని పూర్తి నష్టాల్లోకి నెట్టాయని విమర్శించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోయినా కూడా యూపీఏ ప్రభుత్వం నిలకడగా 7.8 శాతం వృద్ధిరేటు సాధించింది. ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. ఎన్డీయే ప్రభుత్వం అంతకన్నా తక్కువ వృద్ధిరేటును సాధిస్తున్నది అని మన్మోహన్‌ అన్నారు. నోట్లరద్దు, జీఎస్టీలాంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా దేశంలో లక్షల ఉద్యోగాలు పోయాయని ఆయన విమర్శించారు. నిజమైన నాయకత్వం అవకాశాలు కల్పిస్తుంది కానీ వాటిని నాశనం చేయదు. కానీ మోదీ సర్కార్‌ పథకాలన్నీ అలాగే ఉన్నాయి అని మన్మోహన్‌ అన్నారు.