మోదీ ర్యాలీలతో ఒరిగేదేవిూ లేదు – కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

– అవినీతిపై బీజేపీకి మాట్లాడే అర్హత లేదు
బెంగళూరు, మే1(జ‌నం సాక్షి) : ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటకలో ప్రధాని మోదీ జరిపే ర్యాలీలతో ఒరిగేదేవిూ లేదని, ఆయన ర్యాలీల ప్రభావం రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ఉండదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళవారం విూడియాతో ఆయన మాట్లాడుతూ ‘ఇది ప్రజాస్వామ్యమని, ప్రధాని మోదీతో మాకు వ్యక్తిగత శత్రుత్వం లేదని అన్నారు. ఆయన ఇక్కడకు రావడంలో మాకెలాంటి అభ్యంతరాలు లేవన్నారు. ఆయన ప్రభావం మాత్రం ఇక్కడ ఉండద అని సిద్ధిరామయ్య పేర్కొన్నారు. అవినీతిపై బీజేపీకి మాట్లాడే హక్కు లేదని సిద్ధరామయ్య ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి ఎక్కడిది? మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకాయుక్తను ఒక్కసారైనా ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పపై కేసులున్నాయని, ఆయన జైలుకు వెళ్లడం మంచిదన్నారు. నేను ఎలాంటి నేరాలు చేయలేదని, సీబీఐ విచారణ అంటూ వాళ్లు (బీజేపీ) మాట్లాడుతున్నారని, సీబీఐ వారి చేతుల్లో ఉంది.. వారిది రెండు నాల్కల ధోరణి’ అని సిద్ధరామయ్య వరుస విమర్శలు గుప్పించారు. లింగాయత్‌ల అంశం బీజేపీకి తప్ప ఎవరికీ ఎన్నికల అంశం కాదని మరో ప్రశ్నకు సమాధానంగా సిద్ధిరామయ్య సమాధానమిచ్చారు.