మోహన్‌బాబు దాదాగిరికి నిరసనగా (కిక్కర్‌


ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యుల రాజీనామా
` ‘తెలుగువాడు మాత్రమే మా ఎన్నికల్లో పోటీ చేయాలి’ అనే నిబంధన తీసుకురాకపోతేనే రాజీనామాను వెనక్కి తీసుకుంటా: ప్రకాశ్‌రాజ్‌
హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి): సిని‘మా’ బిడ్డలం ప్యానెల్‌ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హావిూలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని ఆరోపించారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్‌ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని అన్నారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని అన్నారు. తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి, ‘మా’ సభ్యుల తరపున నిలబడతామని స్పష్టం చేశారు.
అప్పుడే రాజీనామా వెనక్కి తీసుకుంటా..
‘‘నేను మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. అందుకు మంచు విష్ణు ఆమోదించను అని అన్నారు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ, ఒక షరతు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘మా’ నియమ, నిబంధనలు మార్చి, ‘తెలుగువాడు మాత్రమే మా ఎన్నికల్లో పోటీ చేయాలి’ అనే నిబంధన తీసుకురాకపోతేనే ‘మా’ సభ్యత్వానికి నేను చేసిన రాజీనామాను వెనక్కి తీసుకుంటా. ఓటు వేయడానికో, ఎవరోఒకర్ని గెలిపించడానికో అయితే ‘మా’ సభ్యుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.
పదవులు లేకపోయినా అండగా ఉంటాం: శ్రీకాంత్‌
పదవులు లేకపోయినా విష్ణుకు అండగా ఉంటామని కథానాయకుడు శ్రీకాంత్‌ అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌నుంచి విజయం సాధించిన ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎవరు ఓటు వేసినా, ఒక ప్యానెల్‌ మొత్తానికి ఓటేయండి అని మేము మొదటి నుంచి ‘మా’ సభ్యులను కోరుతున్నాం. పని బాగా జరగాలంటే అది ముఖ్యం. మెంబర్స్‌ ఉన్న వాళ్లలో అందరూ అందరికీ నచ్చాలని లేదు. ఆ ప్యానెల్‌లో కొంతమంది, ఈ ప్యానెల్‌లో కొంతమంది గెలిచాం. అన్నేసి మాటలు అనుకున్నాక కలిసి పనిచేయగలమా? అనిపించింది. మా ప్యానెల్‌లోని సభ్యులు నిన్నే రాజీనామా చేస్తామని అన్నారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఇలాగే కలిసి పనిచేసినప్పుడు విభేదాలు తలెత్తాయి. ఏ సమస్య ఎత్తిచూపినా ‘మమ్మల్ని పనిచేయనీయడం లేదు’ అని అంటారు. విష్ణు నాకు సోదరుడులాంటి వారు. నరేశ్‌గారు చాలా అద్భుతంగా ఎన్నికలను నడిపించారు. తన అనుభవంతో కృష్ణుడిలా చక్రం తిప్పి విష్ణుకు విజయం చేకూర్చారు. ఆయన విష్ణు వెనుక ఉన్నప్పుడు మేము ఏదైనా అంటే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. మా ప్యానెల్‌లో ఉన్న వారంతా తప్పు జరిగితే ప్రశ్నించే ధైర్యవంతులు. మేం వెళ్లి ప్రశ్నిస్తే మళ్లీ గొడవలు అవుతాయి. పదవులు లేకపోయినా అందరికీ మేం అండగా ఉంటాం. మా అసోసియేషన్‌లో పరిణామాలపై చాలా సహిస్తూ వచ్చాను. నరేశ్‌ నన్ను అనేక మాటలు అన్నా భరించాను’’అని శ్రీకాంత్‌ అన్నారు.
మోహన్‌బాబు కొట్టడానికి వచ్చారు: బెనర్జీ
ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన బెనర్జీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను గెలిచిన తర్వాత అభినందనలు చెబుతున్నా, నాకు సంతోషంగా లేదు. ఎన్నికల్లో దూరంగా నిలబడ్డాను. ఒకవైపు మోహన్‌బాబు గారు తనీశ్‌ను తిడుతున్నారు. నేను విష్ణు దగ్గరకు వెళ్లి ‘గొడవలు వద్దు నాన్నా’ అని అన్నాను. అది విన్న మోహన్‌బాబు కొట్టడానికి వచ్చేశారు. విష్ణుబాబు ఆయన్ను అడ్డుకుని నన్ను పక్కకు లాగేశారు. అసభ్య పదజాలంతో మోహన్‌బాబు తిట్టిపోశారు. ఆయన అన్న మాటలకు షాక్‌లోకి వెళ్లిపోయా. మోహన్‌బాబుకి వివాహం కాకముందు నుంచి ఒక ఇంటి సభ్యుల్లా ఉండేవాళ్లం. వాళ్ల ఇంటికి వెళ్తే, మంచు లక్ష్మీని, విష్ణుని ఎత్తుకుని తిరిగేవాడిని. అలాంటి నన్ను పట్టుకుని మోహన్‌బాబు తిడుతుంటే విష్ణు, మనోజ్‌లు వచ్చి ‘సారీ అంకుల్‌ ఏవిూ అనుకోవద్దు. విూరు కూడా ఏవిూ అనొద్దు’ అని సముదాయించే ప్రయత్నం చేశారు. నాకు నా తల్లే సర్వస్వం, ఆమెను తిడుతుంటే చాలా బాధేసింది. రేపు కార్యవర్గ సమావేశం జరిగినప్పుడు వారికి భయపడి మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్లకి భయపడుతూ ఉండటం కంటే రాజీనామా చేయటం మంచిది’’ అని బెనర్జీ కంటతడి పెట్టుకున్నారు.
మోహన్‌బాబు అన్న మాటలు జీర్ణించుకోలేకపోతున్నా: తనీశ్‌
‘‘గతంలో కూడా ఈసీ మెంబర్‌గా పనిచేశా. సమావేశాలు జరిగినప్పుడు చాలా గొడవలు జరిగాయి. నరేశ్‌గారిని పనిచేయనీయడం లేదని ఆయన చెప్పారు. మేం కేవలం ఈసీ మెంబర్స్‌. ఆయన చేసే పనులను మేం ఎక్కడ అడ్డుకుంటాం. మోహన్‌బాబుగారు, విష్ణు, మనోజ్‌ అన్నలు అంటే నాకు ఇష్టం. ఓట్ల లెక్కింపు సందర్భంగా మోహన్‌బాబు అసభ్య పదజాలంతో తిడుతూ నన్ను కొట్టడానికి వచ్చారు. బెనర్జీగారు అడ్డుకునేందుకు వస్తే, ఆయన్నూ తిట్టారు. ఆ తర్వాత విషయం తెలిసి, విష్ణు, మనోజ్‌ అన్నలు నన్ను ఓదార్చారు. అయినా ఆయన అన్న మాటలు జీర్ణించుకోలేకపోతున్నా. అందుకే రాజీనామా చేస్తున్నా. రేపు సమావేశాలు జరిగినప్పుడు ధైర్యం నా వాణి వినిపించలేను’’ అని తనీశ్‌ వాపోయారు.
బెనర్జీ అన్న ఏడవటం నా కెరీర్‌లో చూడలేదు: ఉత్తేజ్‌
‘‘నా భార్య పద్మ కన్నుమూయడంతో ఎన్నికల్లో యాక్టివ్‌గా లేను. కానీ, నాపై నమ్మకంతో ‘మా’ సభ్యులు నాకు ఓటేసి గెలిపించారు. వారందరికీ ధన్యవాదాలు.. బల్బు కనిపెట్టిన థామస్‌ అల్వా ఎడిసన్‌, సినిమాను ఇచ్చిన లూమియర్‌ బ్రదర్స్‌, ‘మాయాబజార్‌’ను గొప్పగా అందించిన మార్కస్‌ బాట్లేలకు సెల్యూట్‌. ఎందుకంటే వీళ్లు లోకల్‌ కాదు. సినిమా అన్న పదమే లోకల్‌కాదు. అలాంటిది ‘మా’ఎన్నికల్లో లోకల్‌, నాన్‌లోకల్‌ అన్న వివాదం తీసుకొచ్చారు. సినిమాను అమితంగా ప్రేమించే ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ కోసం ఏదైనా చేయాలని వస్తే, కొన్నేళ్లు పనిచేస్తున్న మేమంతా ఆయన కలిసి వచ్చాం. శివాజీరాజా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నరేశ్‌ జనరల్‌ సెక్రటరీ. ‘మా’ భవనం కోసం డబ్బును వృథా చేయకూడదని చాలా మంది బస్సులోనే వెళ్లాం. ఎన్నికలు జరిగే రోజున నన్ను అసభ్య పదజాలంతో తిట్టారు. గెలిచిన తర్వాత ‘మా’ భవనంలోకి వెళ్తే థంబ్‌ వేసి వెళ్లాలన్నారు. అమెరికాలో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన లెక్కలు సరిగా లేవని ఆరోపిస్తారా? పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల అధికారులకూ, అవతలి ప్యానెల్‌ సభ్యులకు పసుపు రంగు కార్డులు ఇచ్చారు. నా 25ఏళ్ల కెరీర్‌లో బెనర్జీ అన్న ఏడవటం చూడలేదు. విష్ణు బ్రదర్‌ విూరు బాగా చేయగలరు. విూ వెనుక విూ నాన్నగారు ఉన్నారు. ‘మా’ సభ్యులను కాపాడే ప్రయత్నం చేయండి’’ అని ఉత్తేజ్‌ భావోద్వేగంతో మాట్లాడారు.
అందుకే ఓట్ల లెక్కింపు ఆపేశారు: ప్రభాకర్‌
‘మా’ ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ మెజార్టీ వస్తుందనే ఆపేశారని బుల్లితెర నటుడు ప్రభాకర్‌ ఆరోపించారు. ‘‘ఓట్ల లెక్కింపు మరుసటి రోజుకు వాయిదా వేసిన తర్వాత అందరూ వెళ్లిపోయారు. నేను అక్కడే ఉన్నా. పోస్టల్‌ బ్యాలెట్‌లను ఎన్నికల అధికారి తీసుకెళ్లారు. ‘ఇక్కడ ఉంచండి’ అంటే ‘నాకు హక్కు ఉంది. తీసుకెళ్తున్నా’ అన్నారు. కొంతమందికి ఆయన భయపడ్డారు. ఎదురు మాట్లాడలేకపోయారు. చాలా అన్యాయంగా కౌంటింగ్‌ జరిగింది. ఇంటికి తీసుకెళ్లిన ఈసీ మెంబర్స్‌ ఓట్ల గురించి అడిగితే విష్ణు నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని ఎన్నికల అధికారికి చెబితే ‘శ్రీకాంత్‌ విూరు ఫిర్యాదు చేస్తే, ఎన్నికలు రద్దు అవుతాయి. వివాదం కోర్టుకు వెళ్తుంది. అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు’ అన్నారు. అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో దాన్ని వదిలేశాం’’ అని ప్రభాకర్‌ తెలిపారు.