మౌనముని..

‘టైమ్‌’ బాంబు పేలింది. దీంతో ప్రతిపక్ష బీజేపీ ఒక్కసారిగా సోమరితనాన్ని వదిలి తన అమ్ములపొదిలోని అస్త్రాలకు పదునుపెట్టింది. దేశాన్ని అసమర్థ ప్రధాని పాలిస్తున్నారని తాము చేసే వాదనకు బలం చేకూరింది. ఇంకేముంది రాజీనామా చేయాలన్న పల్లవి ఎత్తుకుంది. బీజేపీ డిమాండ్‌ను చిదంబరం చాలా చక్కగానే తిప్పికొట్టారు. ఎన్డీయే హయాంలో దేశానికి నిద్రపోయే ప్రధాని దొరికాడని, ఇదే పత్రిక విమర్శించినప్పుడు బీజేపీ ఏమీ చేసిందని ఇప్పుడు ఇలాంటి అసహ్యకరమైన డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. అమెరికా కార్పొరేట్‌సంస్థలకు ప్రయోజనకారిగా మెలిగే టైమ్‌ మ్యాగజైన్‌ ప్రచురించిన కవర్‌ పేజీ కథనం ప్రధాని మన్మోహన్‌ను ఇరుకునపెట్టింది. క్రిస్టామెహర్‌ అనే ప్రతినిధి ‘ సాధించవల్సినంత సాధించలేకపోయారు’ అంటూ ప్రధాని మన్మోహన్‌ పాలనపై రాసిన కథనం ప్రతిపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారింది. ఈ పత్రిక పేర్కొన్నది సత్యమైనదే అయినప్పటికీ దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో చూపుతున్నదనేది సత్యదూరం. ఇదే పత్రిక దశాబ్దకాలం క్రితం ఎన్డీయే ప్రధాని వాజ్‌పేయి మీద, అట్లాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కూడా ప్రశంసలు, విమర్శల వర్షం కురిపించింది. తదనంతరం వచ్చిన ఎన్నికల్లో ఈ మ్యాగజైన్‌ కథనం వల్ల వాళ్లు అధికారాన్ని సంపాదించిందీలేదు, పోగొట్టుకున్నదీ లేదు. చంద్రబాబు అయితే రెండు సార్లు ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వచ్చింది. పత్రికా కథనాలే ప్రామాణికమనుకొని ప్రజలు తీర్పు ఇవ్వరనేది చరిత్ర చెప్పే సత్యం. దేశ దార్శినికుడిగా పేరొందిన పీవీ నర్సింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టి దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు శక్తి మేరకు శాయశక్తుల కృషి చేశారు. ఈ మేరకు కొంత విజయం సాధించగలిగారు. విదేశీ పెట్టుబడులు రావడంలోనూ, స్టాక్‌ మార్కెట్‌ పై పైకి దూసుకుపోవడంలోనూ మౌలిక సదుపాయల కల్పనలోనూ ఆయన అనుకున్నంత మేరకు విజయం సాధించగలిగారు. ఇది 1991 నాటి మాట. తదనంతరం 2004 నుంచి సంకీర్ణ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టబడింది. ఎన్డీయే తరువాత యూపీయే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానిగా పగ్గాలుచేపట్టిన మన్మోహన్‌ సింగ్‌ దేశ ప్రగతిని అనుకున్నంత మేరకు సాధించలేకపోయారు. రూపాయి పతనం నానాటికి దిగజారిపోతోంది. ద్రవ్యలోటు మోయలేనంతగా మారింది. ఒకప్పుడు 9 శాతం దాటిన వృద్ధి రేటు నేడు ఉసూరుమంటు చతికిల పడింది. నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయి. ఆర్థిక రంగ పరిస్థితి ఇలా ఉంటే పాలనలోనైనా మెరుగైన ఫలితాలు సాధించలేకపోయారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు లాంటివి దాదాపు వంద వరకు పార్లమెంట్‌ గోడలు దాటి బయటకు రావడంలేదు. ఈ బిల్లులను ఆమోదింపజేయడంలో ప్రధాని భాగస్వామి పక్షాలను ఒప్పించలేక విఫలమయ్యారు. ఇక అవినీతి కుంభకోణాలకు అంతేలేకుండా పోయింది. మూడేళ్ల పాలన.. 30 కుంభకోణాలన్నట్టుగా తయారైంది. అన్నా హజారే లాంటి వారు ప్రధాని మంచి వారే కాని చుట్టూ ఉన్న మందీమార్భలం అవినీతి పరులంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. దీనికి కారణం రాజకీయాధికారాలన్నీ సోనియా చేతిలోనే ఉన్నాయి. కరిస్తే కప్పకు కోపం.. మింగితే పాముకు కోపం అన్నట్టుగా ఏ విషయంలోనూ స్వీయ నిర్ణయాన్ని తీసుకోలేక పాలనపై పట్టు కోల్పోతున్నారు. రాజకీయ అధికారం లేకుండా ప్రధాన పదవి అలంకార ప్రాయంగా మారిపోతున్నా నేటి దుస్థితికి ఏమీ చేయలేక మౌనమునిగా ఉండిపోక తప్పడంలేదు. ప్రతి చిన్న విషయానికీ జనపథ్‌-10 రోడ్డుకు పరుగులు తీయాల్సిందే. ప్రతిపక్షాలు చేతకాని ప్రధాని, దద్దమ్మ, అసమర్థుడు లాంటి పరుషపదజాలమే ఉపయోగించినప్పుడు కిమ్మనకుండాభరించారు. ఈరోజు టైమ్‌ మ్యాగజైన్‌ చేసిన విమర్శ ఇంతకన్న ఘాటైనదేమీకాదు.