యశోద చిత్రంలో సమంత నటన హైలెట్
సమంత కు డూప్‌లతో పనిలేదన్నారు దర్శక ద్వయం హరి ` హరీష్. వారి దర్శకత్వంలో రూపొందుతున్న యశోద చిత్రంలో ఆమె ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న యశోద ఈ ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కానీ, ఇంకా చిత్రీకరణ పూర్తి కాని కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. టాకీ పార్ట్ పూర్తయి కేవలం ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని యూనిట్ సభ్యులు స్వయంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పై.. వచ్చిన ఔట్ పుట్ పై దర్శక ద్వయం చాలా సంతృప్తికరంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా వీరు ఒక జాతీయ స్థాయి విూడియా సంస్థతో మాట్లాడుతూ సమంత గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ’ఇప్పటి వరకు పలు అవార్డు విన్నింగ్ సినిమాలు చేశాం. అయితే, కమర్షియల్ గా జనాలకు చేరువయ్యే సినిమాను చేయాలనే యశోద స్క్రిప్ట్ ను చాలాకాలం క్రితమే రాసుకున్నాము. ఈ స్క్రిప్ట్ అనుకున్న సమయంలోనే ఖచ్చితంగా సమంత అయితేనే బాగుంటుందని కూడా అనుకున్నాం. ఆమెతో చేయాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా సన్నివేశాలను రాసుకున్నాం. సమంత ఫస్ట్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 చిత్రీకరణకు ముందే యశోద సినిమా గురించి చర్చలు జరిపాము. కథను చెప్పిన వెంటనే ’తప్పకుండా ఈ సినిమాను చేస్తాను’.. అంటూ కథ ను కేవలం 25 నిమిషాలు మాత్రమే విని ఓకే చెప్పేశారు. ఆమె ఈ కథను బలంగా నమ్మారు. అందుకే, చాలా కష్టపడి ఈ సినిమా కోసం ఆమె యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. కొన్ని ప్రమాదకర సన్నివేశాలను డూప్ లతో చేయాలనుకున్నాము. కానీ, సమంత ఒప్పుకోకుండా తానే స్వయంగా చేశారు. రోప్ సన్నివేశాలను కూడా స్వయంగా చేశారు’ అని.. చెప్పుకొచ్చారు.