యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు

29నుంచి కోటి కుంకుమార్చన

యాదగిరి గుట్ట,జూలై9(జనంసాక్షి)యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు ప్రధానాలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. ముందుగా 108 కలశాలకు పూజలు నిర్వహించారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవ మూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్ర నామార్చనలు జరిపారు. అలాగే ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 27వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో కోటి కుంకుమార్చన పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 30 రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కోటి కుంకుమార్చన పూజలు జరగనున్నాయి. కోటి కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు రూ. 2 వేల టికెట్‌ ధర నిర్ణయించారు. టికెట్‌ పై దంపతులకు మాత్రమే ఆలయ అధికారులుఅవకాశం కల్పించారు. టికెట్‌ పొందిన కుటుంబ సభ్యుల గోత్రనామాలపై 30 రోజుల పాటు సంకల్ప కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.