యాసంగివడ్లు కిలో కూడా కొనం


` ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదు
` కేంద్రం ప్రమాదకరమైన వైఖరిని అవలంభిస్తోంది
` క్షేత్రస్థాయిలో ధాన్యం కొనమనే విషయాన్ని ప్రజలు వివరిచండి
` కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,డిసెంబరు 18(జనంసాక్షి):కొత్త జోనల్‌ విధానం, ధాన్యం కొనుగోళ్లపై సిఎం కెసిఆర్‌ స్పష్టమైన ఆదేవాలు జారీచేశారు. కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం ప్రకటించారు. కొత్త జోనలు విధానం ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. అలాగే యాసంగిలో కిలో వడ్లు కూడా కొనబోమని రైతులకు స్పస్టం చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రగతి భవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. యాసంగిలో వరిధాన్యం కొనబోమని కేంద్రం పదేపదే చెప్తోందని, ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలని కేసీఆర్‌ ఆదేశించారు. వానాకాలం పంటలసాగుపై ముందస్తు ప్రణాళిక ఉండాలన్నారు. ప్రత్యామ్నాయ లాభసాటి పంటలసాగుపై దృష్టిసారించాలని సూచించారు. పత్తి, వరి, కందిసాగుపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణలోని వ్యవసాయ విధానాలు దేశంలో ఎక్కడా లేవని కేసీఆర్‌ తెలిపారు. అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల వైపు కంటే వరిపైనా ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో 2.49 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా అందులో అత్యధికంగా 1.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. పత్తి 63 వేల ఎకరాల్లో సాగు చేసుకున్నారు. గత యాసంగిలో 167163 ఎకరాల్లో వరి సాగు చేశారు. వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల వైపు అవగాహన కల్పిస్తున్నా రైతులు వరి సాగు చేసి ధాన్యం అమ్ముకునే మార్గాల వైపు ఆలోచనలు చేస్తున్నారు. దీంతో యాసంగి సాగు ప్రశ్నార్ధకంగా మిగిలింది. మరోవైపు వరి సాగు చేస్తే రైతు బంధు ఉండదనే ప్రచారం కూడా మొదలైంది. యాసంగిలో వరి వద్దని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా రైతులు మాత్రం వరి వైపే మొగ్గు చూపుతున్నారు. బురద నేలల్లో ఆరుతడి పంటలు ఎలా వేసేదని రైతులు ప్రశ్నించడంతో అంతా అయోమయం నెలకొంది. యాసంగిలో వరిసాగును వదిలిపెడుతున్న రైతులు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యాసంగి సాగు కోసం రైతులకు ప్రతీ సీజన్‌లో రైతుబంధు కింద అందిస్తున్న పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.

వివక్షను రూపుమాపడమే దళితబంధు లక్ష్యం
` త్వరలోనే పథకానికి నిధుల విడుదల : సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,డిసెంబరు 18(జనంసాక్షి):తరతరలాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ‘దళితబంధు’ పథకం లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ప్రగతి భవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకం ద్వారా వందశాతం సబ్సిడీ కింద అందించే రూ.10లక్షలు.. దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. సామాజిక పెట్టుబడిగా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో దోహదపడుతుందని సీఎం స్పష్టం చేశారు.

 

28నుంచి రైతుబంధు
హైదరాబాద్‌,డిసెంబరు 18(జనంసాక్షి):ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు, దళితబంధుతో పాటు పలు అంశాలపై అధికారులతో చర్చించారు. పంట సాయం పంపిణీ ప్రారంభించిన పది రోజుల్లోనే రైతులందరికీ ఖాతాల్లోనే నగదును జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు. గతంలో మాదిరిగానే ఎకరం మొదలుకొని విడుదల వారీగా అందరికీ పెట్టుబడి సాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

 

నూతన జోనల్‌ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన
హైదరాబాద్‌,డిసెంబరు 18(జనంసాక్షి):కొత్త జోనల్‌ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజన ను చేపట్టాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్‌ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రగతి భవన్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమై పలు అంశాలపై చర్చిస్తున్నారు.వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని ఆదేశించారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు అయితే (స్పౌస్‌ కేస్‌) ఒకే చోట విధులు నిర్వర్తిస్తేనే వారు ప్రశాంతంగా పనిచేయ గలుగుతరని సీఎం పేర్కొన్నారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్‌ కేస్‌ అంశాలను పరిష్కరించాలని సీఎం సూచించారు.