యాసంగి నీటి కోసం ప్రణాళికలు
నిజామాబాద్,నవంబర్2(జనంసాక్షి): శ్రీరామ్‌సాగర్ నుంచి యాసంగికి నీటి విడుదలకు సిఎం కెసిఆర్ ఇటీవల ఆమోదించడంతో తగిన ప్రణాళికను రూపొందించాలని మంత్రి హరీష్‌రావు ఇటీవల జరిపిన సవిూక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ పంటలకు నీటివిడుదల కొనసాగుతున్న దశలో ఇటీవల ఎగువనుంచి వరదనీరు వచ్చిచేరటంతో శ్రీరామ్‌సాగర్ జలాలు జగిత్యాల జిల్లా ప్రజలకు రబీవేసంగి పంటలపై పూర్తి భరోసా కల్పించాయి. వానాకాలం పంటలు ముగిసిన ప్రాంతాల్లో నవంబరు రెండో పక్షం లేదా డిసెంబరు నుంచి రబీ వేసంగి పంటలకు కాలువనీటిని వదిలేలా అధికారులు నీటితడులను నిర్ధేశిస్తారు. చివరి గ్రామాల భూములకు సైతం సాగునీరందించేలా కాకతీయ కాలువలో గరిష్ఠంగా నీరుపారేలా చర్యలు తీసుకోవడానికి అధికారులు ఉపక్రమించారు.కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో వానాకాలం పంటలకు చెరువులు నింపడానికి నీటిని విడుదల చేశారు. వానాకాలం పంటలకు వదిలిన తరువాత కూడా రబీవరకు ప్రాజెక్టులో గరిష్ఠంగా నీటి లభ్యత ఉండటంతో పూర్తిఆయకట్టుకు నీరందించేలా చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు. . ఈప్రాజెక్టువల్ల జగిత్యాల జిల్లాకు అత్యధిక ప్రయోజనం కలగనుంది. జిల్లాలోని 15 మండలాల ఆయకట్టుకు కాకతీయ కాలువద్వారా కాలువనీళ్లు అందుతుండగా వరదకాలువ వల్ల ఆరుమండలాలకు నీరందుతుంది. కాలువనీళ్లు వస్తే భూగర్భ జలమట్టం కనిష్ఠస్థాయిలో కొనసాగి పంపుసెట్ల ఆధారితంగానూ రైతులు పంటలను పండిస్తారు. వేల హెక్టార్ల జొన్న, సజ్జ పంటలను వేయనున్నారు. మిగిలిన విస్థీర్ణంలో సంకర విత్తనోత్పత్తి, కంది, వేరుసెనగ, ఆవాలు, మిరప, అలసంద, కూరగాయలు తదితర పంటలను విత్తుకోనున్నారు.