యాసంగి పంటలకు కాళేశ్వరం నీళ్లు ఉన్నయి : మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట: కాంగ్రెస్‌ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్‌ రావు  అన్నారు. కాళేశ్వరం  నీళ్లు రాకపోతే పండేనా అని ప్రశ్నించారు. నీళ్లు లేకపోతే జీవం లేదు, నీళ్లు లేకపోతే బతుకుదెరువు లేదన్నారు. అలాంటి జీవాన్ని సీఎం కేసీఆర్‌ ఇచ్చారని చెప్పారు. సిద్దిపేటలోని టీటీసీ భవన్‌లో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 233 మంది దివ్యాంగులకు ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగులకు దేశంలోనే అత్యధికంగా రూ.4016 పింఛను అందిస్తున్నామన్నారు. దివ్యాంగుల పట్ల మానవతా దృష్టి, ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రూ.1000 మించి పింఛన్‌ ఇవ్వడం లేదని విమర్శించారు.వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీ హయాంలో దొంగరాత్రి కరెంటు, పేలిన ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిన మోటర్లు అని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలు తిట్ల పోటీలో పోటీ పడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ వడ్లు పుట్లు పుట్లుగా పండించేందుకు పోటీ పడుతున్నారని తెలిపారు. మన వడ్లు కొనడానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అడుగుతున్నాయని చెప్పారు. తెలంగాణను దేశ ధాన్యాగారంగా సీఎం కేసీఆర్‌ మార్చారని తెలిపారు.