యుద్దక్రీడలకు చరమగీతం పాడుతాం
సాహసం ఉన్నవారే శాంతి ప్రతిపాదనలు చేస్తారు
చర్చలతో మార్పు సాధ్యమని తేలింది
కొత్త చరిత్ర లిఖించబోతున్నాం
కిమ్ టాలెంటెడ్ అని ప్రశంస
చర్చల అనపంతరం విూడియాతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్
సింగపూర్,జూన్12(జనం సాక్షి ): ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, తాను సాహసికులమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధం ఎవరైనా చేస్తారు, సాహసం ఉన్నవారే శాంతి పక్రియ చేపడతారని ట్రంప్ అన్నారు. యుద్ధ క్రీడలకు చరమగీతం పాడాలన్నదే తన అభిమతమన్నారు. అందుకే తామిద్దరం కలిసి చర్చలు జరుపుతున్నామని, మార్పు సాధ్యమేనని నిరూపించామని చెప్పారు. తమ చర్చలు చారిత్రకమని, గొప్ప ముందడుగు అని అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఓ మంచి మార్గమని వ్యాఖ్యానించారు. సింగపూర్ లోని కంపెల్లా ¬టల్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో చర్చల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విూడియాతో సుధీర్ఘంగా మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇది చారిత్రక సమావేశమని, కిమ్ తో చర్చలు ఫలప్రదంగా జరిగాయని ట్రంప్ అన్నారు. నార్త్ కొరియాలోని క్షిపణ ప్రయోగ కేంద్రాలన్నీ ధ్వంసం చేస్తామని కిమ్ హావిూ ఇచ్చారని వెల్లడించారు. వీలైనంత త్వరలో ఆ దేశంలో అణు నిరాయుధీకరణ జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు కిమ్ కు ధన్యవాదాలు తెలిపారు. కొత్త చరిత్ర లిఖించేందుకు తాము సిద్ధమవుతున్నామని చెప్పారు. కిమ్ వెరీటాలెంటెడ్ అంటూ ట్రంప్ ప్రశంసించారు. నిన్నటి ఉద్రిక్తతలు రేపటి యుద్దానికి దారితీయకూడదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఉభయ కొరియాల ప్రజలు శాంతియుతంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. యుద్దాల వల్ల తీవ్రంగా నష్టపోతామని ట్రంప్ అన్నారు. కిమ్ తో తన చర్చలపై విమర్శలు చేస్తున్న వారికి ట్రంప్ సమాధానం చెప్పారు. తామిద్దరి చర్చలు నార్త్ కొరియాకు ఎంతమంచిదో అమెరికాకు అంతే మంచిదని స్పష్టం చేశారు. కిమ్ తో చర్చలకు సహకరించిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. కొరియా ద్వీపకల్పంలో సైనిక విన్యాసాలు నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటించారు. అక్కడి నుంచి తమ సైనికులను వెనక్కి రప్పిస్తామని చెప్పారు. నార్త్ కొరియాకు సహాయం కొనసాగుతుందన్నారు. ఉత్తర కొరియా ఒలింపిక్స్ లో పాల్గొనడం మంచి పరిణామమని ట్రంప్ అన్నారు. ఆ దేశం మిగతా ప్రపంచంతో కలవాలని కోరుకుంటోందని అభిప్రాయపడ్డారు. సరైన సమయంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు కిమ్ ను ఆహ్వానిస్తానని ట్రంప్ చెప్పారు. చర్చలకు ఎప్పుడైనా సిద్ధమేనని కిమ్ అన్నారని ఆయన వెల్లడించారు. భవిష్యత్ చర్చలపై వచ్చే వారమే కార్యాచరణ రూపొందిస్తామన్నారు. చర్చల కోసం సింగపూర్ వరకు రావడం పట్ల ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. అణ్వాయుధ దేశమైన నార్త్ కొరియాకు వెళ్లడం గౌరవంగా భావిస్తానని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నార్త్ కొరియా నాయకత్వం ఇచ్చిన మాటపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడితో జరిగే సమావేశంలో తమ చర్చల సారాంశం వివరిస్తానని ట్రంప్ తెలిపారు.