యురేనియం తవ్వకాలను నిలిపివేయాలి

– గర్భిణులకు గర్భస్రావాలు జరుగుతున్నాయి
– ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారు
– సీఎం జగన్‌కు లేఖరాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, అక్టోబర్‌7( జనం సాక్షి ) : పులివెందుల ప్రాంతంలో యురేనియం తవ్వకాలను తక్షణమే నిలిపివేసేలా ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. సోమవారం ఈ మేరకు జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. కడప జిల్లా పులివెందుల సవిూపంలోని ఆర్‌ తుమ్మలపల్లిలోన ఏర్పాటైన యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా శుద్ధి కర్మాగారాన్ని తక్షణమే మూసేయాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు కనుగొనేందుకు చేపట్టిన డ్రిల్లింగ్‌ పనులను కూడా నిలిపివేయాలన్నారు. యురేనియం తవ్వకాలు జరుగుతున్న పులివెందుల ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. యురేనియం ప్రభావంతో సవిూప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రామకృష్ణ తెలిపారు. భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయని, ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. యురేనియం ఫ్యాక్టరీ టెయిల్‌పాండ్‌, ఆర్‌ తుమ్మలపల్లి సవిూపంలోని కేకే కొట్టాల గ్రామాల్లో విపక్ష నేతలు పర్యటించారని, ఫ్యాక్టరీ కారణంగా పడుతున్న ఇబ్బందులను ఆయా పార్టీల నేతలకు వివరించారన్నారు. యురేనియం ప్రభావంతో ఎండిపోయిన పంటలను చూపించారని, చర్మవ్యాధుల బారిన పడుతున్నామని రామకృష్ణ వాపోయారు. భూగర్భ జలాలు కలుషితమవడంతో మహిళలకు గర్భస్రావాలు జరుగుతున్నామని కేకే కొట్టాల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పులివెందుల పరిసర గ్రామాల మహిళలను ప్రసవం కోసం పుట్టింటికి పంపలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. యురేనియం ఫ్యాక్టరీ వ్యర్థాల కారణంగా భూగర్భజలాలు కలుషితం అయ్యాయని, ఆ నీళ్లు తాగడంతో గర్భస్రావాలు జరుగుతున్నాయన్నారు. ఒక్క కేకే కొట్టాల గ్రామంలోనే ఇటీవల తొమ్మిది మంది గర్భిణులకు గర్భస్రావం అయిందని మహిళలు చెప్పారని రామకృష్ణ పేర్కొన్నారు. యురేనియం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా తమ దృష్టికి వచ్చిన అంశాలపై సీపీఐ నేత రామకృష్ణ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. పర్యావరణానికి పెను ప్రమాదంగా పరిణమించిన యురేనియం తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.