యువతను మోసం చేసిన బీఆర్ఎస్ ను రానున్న ఎన్నికల్లో ఓడిస్తాం:
బీఆర్ఎస్ హఠావో – తెలంగాణ బచావ్ పోస్టర్ ఆవిష్కరణ
– ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సమితి
హిమాయత్ నగర్ జనం సాక్షి
యువతను మోసం చేస్తున్న బీఆర్ఎస్ ను రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని,బీఆర్ఎస్ కు ఇవే చివరి ఎన్నికలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలీ ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర లు ఉద్ఘాటించారు. ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలీ ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంద్ర లు “బీఆర్ఎస్ హఠావో – తెలంగాణ బచావ్” వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వమని, నిరుద్యోగ హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారని వారు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు పేపర్ లీకేజీ ప్రభుత్వాన్ని…లిక్కర్ మాఫియా ప్రభుత్వాన్ని…మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాన్ని….విద్యార్థుల భవిష్యత్ ను తాకట్టు పెట్టిన ప్రభుత్వాన్ని….నిరుద్యోగుల జీవితాలతో చెలాగాటమాడుతున్న ప్రభుత్వాన్ని….రాష్ట్రంలో మత్తు పదార్థాలను కట్టడి చేయలేని ప్రభుత్వాన్ని…కమీషన్ల ప్రభుత్వాన్ని గద్దెదించుదామనే నినాదంతో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన లోకాన్ని చైతన్యపరుస్తామని వారు అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి బూటకపు హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేయడం దుర్మార్గమన్నారు. 6,753 కోట్ల విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతన బకాయిలను విడుదల చేయకుండా అలసత్వం వహిస్తున్నారని, నిరుద్యోగ భృతి 3,116/- ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.పోటీ పరీక్షల ఉతీర్ణతా అభ్యర్థులకు నియామక పత్రాల అంశంలో జాప్యం చేస్తున్నారని,విద్య, వైద్యం, ఉపాధి హక్కులు పౌరులకు పూర్తి స్థాయిలో అందించాలని వారు డిమాండ్ చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీ పట్ల తెలంగాణ యువత జాగరూకతతో ఉండాలని,ఆచరణకు సాధ్యం కాని హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ను ప్రశ్నించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నిర్లకంటి శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, లింగం రవి,…కార్యవర్గ సభ్యులు బిజ్జ శ్రీనివాసులు,మొగిలి లక్ష్మణ్, టి.సత్య ప్రసాద్, మానస్ కుమార్,కిషోర్, ఎల్లంకి మహేష్, మెస్రం భాస్కర్, సద్దాం,గిరి బాబు, భాస్కర్, వేణు గోపాల్, దేవేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.