యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి
యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి : మంత్రి ఎర్రబెల్లి
జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని మెగా జాబు మేళా నిర్వహిస్తున్నాం. మొత్తం 80 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. దీని వలన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడుతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం డి.ఆర్.డి.ఎ, జనగామ, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో పాలకుర్తిలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది.
ఈ జాబ్ మేళాలో మల్టీ నేషనల్ కంపెనీలు సహా మొత్తం 80 వివిధ కంపెనీలు పాల్గొనగా, 14వేల 205 మందికి ఉద్యోగావకాశాలు కల్పించడానికి అవకాశాలు ఉండగా, ఆయా ఉద్యోగాల కోసం వేలాదిగా ఉద్యోగార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లక్షా 35వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు.
మంత్రి కేటీఆర్ కృషిత రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు విదేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ యువత నైపుణ్యాలు పెంచుకోవాలి. నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.