యూపి ఎన్నికల దృష్ట్యానే ఓబిసి బిల్లు
50శాతం సీటింగ్‌ను రద్దుచేయాలి
ఓబిసి పై చర్చలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్
న్యూఢల్లీి,ఆగస్ట్10(జనం సాక్షి): యూపి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఓబిసి రిజర్వేషన్ల బిల్లును తెరపైకి తెచ్చిందని లోక్‌సభలో కాంగ్రెస్ దాడి ప్రారంభించింది. పెగాసస్ వ్యవహారంతో అసలు కార్యకలాపాలు స్తంభించిన వేళ ఓబిసి బిల్లు ప్రవేశ పెట్టడంతో జరిగిన చర్చలో కాంగ్రెస్ పాల్గొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ యూపీ ఎన్నికల నేపథ్యంలో ఈ బిల్లును తెచ్చినట్లు ఆరోపించారు. రిజర్వేషన్లపై సీలింగ్‌ను పెంచాలని చాలా రాష్టాల్రు భావిస్తున్నట్లు అధిర్ తెలిపారు. కుల వ్యవస్థ ఉన్నందు వల్లే దేశంలో రిజర్వేషన్లు అవసరం ఉందన్నారు. లోక్‌సభలో మంగళవారం రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. స్పీకర్ ఓం బిర్లా కోరిక మేరకు విపక్ష సభ్యులు సభలో నినాదాలు ఆపేశారు. దీంతో ఆ బిల్లుపై చర్చ మొదలుపెట్టారు. మంత్రి వీరేంద్ర కుమార్ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఓబీసీ జాబితా తయారు చేసేందుకు రాష్టాల్రకే అధికారం ఇచ్చే రీతిలో ఓబీసీ సవరణ బిల్లును తీసుకువచ్చారు. ఈ సవరణ బిల్లు వల్ల దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో సుమారు 4వేల మంది ఓబీసీలకు సీట్లు దక్కనున్నాయి. ఇది కీలకమైన బిల్లు కాబట్టే తాము చర్చలో పాల్గొంటున్నామని అధీర్ రంజన్ అన్నారు. ఈ బిల్లు పాస్ కావాలంటూ మూడవ వంత సభ్యులు కూడా అవసరమన్నారు. విపక్షాలే సభను అడ్డుకుంటున్నాయని ప్రభుత్వం చెబుతోందని, కానీ ప్రజల బాధలను వెలుగులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కీలక పాత్ర పోషించిందని అన్నారు. పంచాయతీ రాజ్ చట్టం అమలులో రాజీవ్ గాంధీ పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఓబీసీ జాతీయ కమిషన్ 2018లో రాష్టాల్ర హక్కులను తీసుకున్నదని, విూరు చేసిన తప్పునే ఇప్పుడు మళ్లీ సరిదిద్దుతున్నట్లు చెప్పారు. అణగారిన వర్గాలను అభివృద్ధిపరిచేందుకు రిజర్వేషన్ వ్యవస్థ తప్పదని అధిర్ తెలిపారు. జ్యోతిరావ్ పూలే గురించి కాంగ్రెస్ నేత మాట్లాడారు. మరాఠా రిజర్వేషన్ల గురించి చెప్పిన అధిర్.. మహారాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని అభ్యర్థించారు. రిజర్వేషన్లపై 50 శాతం ఉన్న సీలింగ్‌ను రద్దు చేయాలని ఆయన కోరారు. అధిర్ రంజన్ మాట్లాడుతున్న సమయంలో సభలో సోనియా గాంధీ కూడా ఉన్నారు.