యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: రాజ్‌నాథ్‌ సింగ్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): నిజాం కాలేజీలో జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ వచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని పేర్కొన్నారు. రక్షణ, విదేశీ వ్యవహారాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో పొరుగు దేశాలతో సంబంధాలు పూర్తిగా క్షిణించాయని పేర్కొన్నారు. చైనా దళాలు భారత్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చినా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని ఎద్దేవా చేశారు. పాక్‌ సైనికులు మన జవాన్ల తలలు నరికి తీసుకెళ్లినా ఈ ప్రభుత్వానికి చలనం లేదన్నారు. అయినా మన విదేశాంగ మంత్రి చైనా పర్యటన కోసం తహతహలాడుతున్నారని  రాజ్‌నాథ్‌ విమర్శించారు. మావోయిస్టుల సమస్య పరిష్కారానికి యూపీఏ ప్రభుత్వం వద్ద ఎలాంటి కార్యచరణ లేదని చెప్పారు. ఛత్తీస్‌ఘడ్‌ మావోయిస్టుల ఘటనను కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేసిందని, ఎన్నికలయ్యాక వాగ్ధానాన్ని కాంగ్రెస్‌ విస్మరించిందని పేర్కొన్నారు. అవినీతి మంత్రులను రాజీనామా చేయించి చేతులు దులుపుకున్నారని రాజ్‌నాథ్‌ చెప్పారు.