యూపీలో అధికారం మాదే
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
లక్నో,జూన్ 27(జనంసాక్షి): వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరుగబోయే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. యూపీలో రాబోయేది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మూడింట రెండు వంతుల మెజారిటీ గెలుచుకుని ప్రభుత్వాని ఏర్పాటు చేసి తీరుతామన్నారు. సోమవారం ఆయన బారాబంకి జిల్లాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని ఆయన టార్గెట్ చేశారు. ఇరువురు నేతలు అవినీతిని ప్రొత్సహించిన వాళ్లేనని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఎస్పీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఇపుడు యూపీవాలా అని అన్నారు. బనారస్ లోక్‌సభ స్థానం నుంచి మోదీ గెలిచారని అన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందని వివరించారు. గుజరాత్ తర్వాత ఆయన యూపీ అభివృద్ధి బాధ్యతలను స్వీకరిస్తున్నారని తెలిపారు.