యూపీ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్
న్యూఢిల్లీ,జులై 14(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాను తమ తరుపుముక్కగా కాంగ్రెస్ భావిస్తోంది. గతకొంతకాలంగా ఆమెపేరును ఖరారు చేస్తారన్న వార్తలకు బలం చేకూరుస్తూ ఆమె పేరును ఖరారు చేసింది. గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నే,యూపి వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాంనబీ ఆజాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పారట్‌ఈ ముందుగానే ఆమెపేరును ప్రకటించిందని అన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్‌కు వరుస పరాజయాలు ఎదురవుతూ వస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా తమ పార్టీని బలపరచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే.. పార్టీలో కీలక మార్పులు చేర్పులు చేపట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ యూపీ ఇన్‌ఛార్జ్‌గా రాజ్‌బబ్బర్‌ను నియమించింది. తాజాగా సీఎం అభ్యర్థిగా షీలాను ప్రకటించింది. మూడు పర్యాయాలు దిల్లీ సీఎంగా పనిచేసిన అనుభవం షీలాదీక్షిత్‌కు ఉంది. అయితే తొలుత ఈ వార్తలను షీలా వ్యతిరేకించి నప్పటికీ.. ఇటీవల ఓ విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం పార్టీ ఏది కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తాను యూపీ కోడలినని చెప్పుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి అభ్యర్థినేనని చెప్పకనే చెప్పారు షీలా. ఇదిలావుంటే యూపి ఎన్నికలకు పోతున్న తరనుణంలో ఆమెను కేసులు వెన్నాడుతున్నాయి. షీలా దీక్షిత్‌కు ఏసీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. వాటర్ విూటర్ల స్కామ్ విచారణకు తమ ముందు హాజరు కావాలని కోరారు. 2011లో షీలా దీక్షిత్ ప్రభుత్వ హయాంలో భారీ స్కామ్ జరిగింది. రెండున్నర లక్షల వాటర్ విూటర్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో 2014లో ఢిల్లీ ఏసీబీ ఆమెపై కేసు నమోదు చేసింది. అయితే తాను కేసును ఎదుర్కొంటామని అన్నారు. యూపీలో ఎన్నికలు పెద్ద సవాలేనని, అయితే దానికి పూర్తి సంసిద్ధతతో వెళ్తామని కాంగ్రెస్ సిఎం అభ్యర్థి షీలా దీక్షిత్ అన్నారు. ఈసారి విజయం తమదేనన్న విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రియాంక ప్రచార బాధ్యతలు తీసుకోవాలని తాను కూడా కోరుకుంటున్నానని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ప్రచారం చేయొచ్చని షీలా పేర్కొన్నారు. ముదిమి వయసులో మరోమారు అదృష్టం తన్నుకు వచ్చేలా 78 ఏళ్ల వయసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై పెద్ద బాధ్యతనే మోపింది కాంగ్రెస్ పార్టీ. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగే ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత జనార్దన్ ద్వివేదీ అధికారిక ప్రకటన చేశారు. ఆమెకున్న మంచి పేరు, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా పనిచేసిన యూపీకి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత ఉమాశంకర్ దీక్షిత్ కోడలు షీలాదీక్షిత్. తనకు ఈ బృహత్తర బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్‌కు షీలా కృతజ్ఞతలు తెలిపారు. యూపీ కోడలిగా రాష్ట్రంలో పార్టీ తనకు ఎలాంటి బాధ్యతను ఇచ్చిన తాను సిద్ధమేనని ఇంతకుముందే ఆమె ప్రకటించారు. గత నెలలో పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సోనియా, రాహుల్‌లను కలిసిన సమయంలోనే షీలాదీక్షిత్ సీఎం అభ్యర్థిత్వం ఖరారైంది. బీజేపీ వైపు మళ్లిన తమ సాంప్రదాయ బ్రాహ్మణ ఓటు బ్యాంకును మళ్లీ తమవైపు తిప్పుకోవడానికి షీలా దీక్షిత్‌ను తెరపైకి తెచ్చింది కాంగ్రెస్. రాష్ట్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో బలంగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం ఆ ప్రాంతాల్లోని అభ్యర్థుల తలరాతలను తారుమారు చేయగలదు. దీంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అందరిని కలుపుకుని పోయి పార్టీని ముందుకు నడిపిస్తానని షీలా పేర్కొన్నారు.