యూరియా కష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత
కరీంనగర్,సెప్టెంబర్5 (జనం సాక్షి ) : గతంలో ఎప్పుడు కూడా ఇలా రాష్ట్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కలేదని మాజీమంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇది సర్కార్ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వేకువజాము నుంచే పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు బారులు తీరుతున్నారు. కార్యాలయం ఎదుట ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలను క్యూలో ఉంచి యూరియాను కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. కొంత మంది రైతులకు యూరియా లభించకపోవడంతో రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా యూరియా లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు యూరియా నిల్వలను అందుబాటులో ఉంచకపోవడం దారుణమని మాజీమంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం చూపి అంతా అద్భుతాలు సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 37వేల కోట్లతో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టును కమిషన్ కోసమే 80వేల కోట్లతో రీడిజైన్‌చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలిపారని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరు జలాశయానికి చుక్క నీరు రాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మాత్రమే నీటిని మిడ్‌మానేరుకు తరలించారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించామని చెబుతున్న నాయకులు, అధికారులు ఎన్ని టీఎంసీలు ఎక్కడినుంచి ఎక్కడికి తరలించారో వివరాలతో వెల్లడించాలని అన్నారు. కడెం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి, ఎల్లంపల్లి ద్వారా మిడ్‌మానేరుకు నీరు తరలిందని అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చుక్కనీరు రాలేదని అన్నారు.