యోగా అంతగొప్పదైతే భాజపా పాలిత రాష్ట్రాల్లో మద్యనిషేధం విధించండి
– బీహార్ ముఖ్యమంత్రి నితీష్ సవాల్
పలము,జూన్ 19(జనంసాక్షి): యోగాపై అంత గురి ఉంటే మొదట బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యంపై నిషేధం విధించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రదాని నరేంద్ర మోదీకి సూచించారు. ‘మద్యం తీసుకోరాదన్నది యోగాలో తొలి నియమం. యోగాను ప్రమోట్ చేయాలనే చిత్తశుద్ధి విూకుంటే మొదటి మద్య నిషేధం అమలు చేయండి’ అని నితీష్ అన్నారు. జార్ఖండ్‌లోని పలములో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నితిష్ పాల్గొన్నారు. జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించరాదన్న బీహార్ ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నితీష్ తాజా వ్యాఖ్యలు చేశారు. యోగా ఒకరోజు వ్యవహారం కాదని, అదొక జీవనమార్గమని నితీష్ అభివర్ణించారు. ప్రధాని మోదీ ఎన్నేళ్లుగా యోగా చేస్తున్నారో తనకు తెలియదని, అయితే తాను మాత్రం ఆసన, ప్రాణాయామ, యోగా నిద్రాణ్‌లను ఏళ్ల తరబడి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఒకవైపు యోగా డే జరుపుకుంటూ, మరొకవైపు మద్యం అమ్మకాలు సాగించడం పొంతన లేని వ్యవహారమని విమర్శించారు.