యోగా జీవితంలో భాగం కావాలి
మనిషి మనిషిగా బతకాలంటే యోగా, ధ్యానం గొప్ప సాధనాలు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు
ప్రజాదర్భార్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో పాల్గొన్న సీఎం
ఆసనాలను సునాయసంగా వేసి అబ్బురపర్చిన చంద్రబాబు
అమరావతి, జూన్21(జనం సాక్షి) : యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అమరావతి ప్రజా దర్బార్ హాలులో ఆయుష్ విభాగం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 69 ఏళ్ల వయసులోనూ ఓ యువకునిలా అన్ని ఆసనాలను సునాయాసంగా వేసిన ముఖ్యమంత్రి అందరినీ అబ్బురపరిచారు. ప్రతిరోజూ గంట పాటు యోగా చేయడం ఎంతో ప్రశాంతత ఇస్తుందని అన్నారు. యోగా వారసత్వ సంపద అని.., మనిషి మనిషిగా బతకాలంటే యోగా-ధ్యానం గొప్ప సాధనాలని అభిప్రాయపడ్డారు. న్గే/ళిటి సమాజంలో మనమంతా ఆనందం, ఆరోగ్యం మరచి డబ్బులు వెంటపడి అనర్థాలు కొనితెచ్చుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. కుటుంబ వ్యవస్థతో ఎన్నో ఒత్తిళ్లకు దూరం కావొచ్చని…. నిత్య జీవితంలో యోగా-కుటుంబ వ్యవస్థ ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. ప్రకృతితో అనుసంధానమై యోగా చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ప్రస్తుతం శారీరక వ్యాధుల కంటే మెదడుకు సంబందిత వ్యాధులు ఎక్కువ వస్తున్నాయని… దీనికి ఒత్తిళ్లే కారణమన్నారు. మెదడును నియంత్రించుకోవాలంటే యోగా గొప్ప సాధనమని తెలిపారు. రోగం వస్తే డాక్టర్లు మందులు ఇవ్వగలుగుతారు కానీ…. ప్రకృతి వల్ల పొందే ఆరోగ్యాన్ని ఇవ్వలేరన్నారు. ప్రతి ఒక్కరు ఒత్తిడికి లోనయినప్పుడు 5 నిమిషాలు యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. సంపద ఆనందాన్ని ఇవ్వదని…, మానవ సంబంధాలు మాత్రమే ఆనందాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. యోగా అనేది ఒక కులానికి,మతానికి సంబందించిన విషయం కాదని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ యోగా చేయాలి ా ఏపీ స్పీకర్
ప్రతిరోజూ యోగా చేయడం వలన ఆరోగ్యంతో పాటు ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటారని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన వేడుకల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మన వారసత్వ సంపదన్నారు. ఒకప్పుడు మనకే పరిమితమైన యోగా నేడు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నారని తెలిపారు. చిన్నప్పటి నుండే యోగా చేయడం వలన పిల్లలకు మంచి నడవడికతో పాటు క్రీడలు, చదువులో ముందుంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజులో అరగంట సమయాన్నియోగాకు కేటాయించాలని స్పీకర్ కోడెల పిలుపునిచ్చారు.