యోగి.. నిన్ను ఎన్నుకుంది.. 

కర్ణాటక రాజకీయాలకోసం కాదు
– ఇసుక తుఫాన్‌తో ప్రజలు చనిపోతుంటే ప్రచారం కోసం వెళ్తావా?
– నీ మఠాన్ని కర్ణాటకకు మార్చుకుంటే మంచిది
– యోగిపై ట్విట్టర్‌లో మండిపడ్డ అఖిలేశ్‌యాదవ్‌
లక్నో, మే4(జ‌నం సాక్షి ) : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్న ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఇసుక తుపాను విజృంభించి, దాదాపు 100 మందిని పొట్టనబెట్టుకున్న తరుణంలో వేరొక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తుండటాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ట్వీట్‌లో యోగిపై మండిపడ్డాడు. కర్ణాటక ప్రచారాన్ని వదిలేసి, తక్షణమే రాష్ట్రానికి రావాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయనను ఎన్నుకున్నారు కానీ కర్ణాటక రాజకీయాల కోసం కాదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తిరిగి రావడం లేదని, అలాంటపుడు ఆయన తన మఠాన్ని అక్కడే కట్టుకుని ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలి అని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఇసుక తుపాను రావడంతో 100 మందికి పైగా మరణించారు, పంటలు దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి, బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
—————————————-