రక్త పిశాచులు ఐసిస్ ఉగ్రవాదులు
– చేయి చేయి కలుపుదాం
– ఐసిస్‌ను అంతమొందిద్దాం
– అబూబకర్ నీ శరీరాన్ని వంద ముక్కలుగా నరుకుతారు
– ఎంపీ అసదుద్దీన్ ఫైర్
హైదరాబాద్,జులై 9(జనంసాక్షి): ‘వాళ్లు నరకలోకపు కుక్కలు. ఇస్లాం పేరుతో అమాయకుల రక్తం తాగుతోన్న రాక్షసులు. మొహమ్మద్ ప్రవక్త మసీదునే ధ్వంసం చేయాలనుకున్న విద్రోహులు. పశ్చిమదేశాల చేతుల్లో ఆయుధాలుగామారి ఇస్లాం మూలాలను ధ్వంసం చేయాలనుకుంటున్న కుట్రదారులు. వాళ్లకు ఇదే నా సవాల్..జిహాద్ చెయ్యాలనుకుంటున్నారా.. ఇక్కడి బస్తీల్లోకి రండి. పేద ముస్లింల ఆకలి బాధ తీర్చండి. పిల్లలకు చదువులు చెప్పించండి, ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం చెయ్యండి. జిహాద్ అంటే ఇస్లాం కోసం చావడం కాదు. ఇస్లాం కోసమే బతకడం’ అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఐసిస్ ఉగ్రమూకలపై నిప్పులు చెరిగారు. దారూసలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యక్తరలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. గతంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ఉగ్రచర్యలను ఖండించి, ఐసిస్ చీఫ్ కు డెత్ వార్నింగ్ ఇచ్చారాయన.ఐసిస్ చర్యల వల్ల ముస్లింలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం గొంతు వినిపించలేని పరిస్థితి దాపురించిందని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసిస్ ఉగ్రవాదులను నరకం నుంచి వచ్చిన కుక్కలతో పోల్చిన అసదుద్దీన.. ‘ఏదోఒక రోజు అసలైన ముస్లిం ఒకడు నీ దగ్గరికొస్తాడు. నీ శరీరాన్ని 100 ముక్కలుగా నరుకుతాడు’ అంటూ ఐసిస్ చీఫ్ అబూ బకర్ బాగ్దాదీని హెచ్చరించారు. భారత్ గొప్ప దేశమని, క్లిష్ట సమయంలో ముస్లింలంతా ఐక్యంగా, శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. సూఫీ, షియా, దేవ్ బందీ, బరేల్వీ.. ముస్లింలోని అన్నివర్గాలు ఒక్కటై ఐఎస్ ను అంతం చేయాలని అన్నారు.