రక్షణ బాధ్యత అప్గన్లదే

మెరికా భద్రతా సలహాదారు సలివన్‌
వాషింగ్టన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అప్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వల్ప వ్యవధిలోనే చేజిక్కించుకోవడానికి ఆ దేశ సైనిక బలగాల వైఫల్యమే కారణమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ నిందించారు. అప్గన్‌లో మూడో దశాబ్ది సంఘర్షణలోకి అమెరికా అడుగు పెట్టాలని అధ్యక్షుడు జో బైడెన్‌ కోరుకోవడం లేదని తెలిపారు. రెండు దశాబ్దాల పాటు అప్గన్‌ రక్షణ కోసం అమెరికా వందల కోట్ల డాలర్లు వెచ్చించిందని, అక్కడి సైనికులకు శిక్షణ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇకపై స్వదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అప్గన్‌ సైన్యానిది, అక్కడి ప్రజలదేనని తేల్చిచెప్పారు. రాజధాని కాబూల్‌ విషయంలో తాలిబన్లతో పోరాటం వద్దని అప్గన్‌ సైనికులే నిర్ణయించుకున్నారని, అందులో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తాలిబన్లపై సొంతంగా పోరాటం సాగించడానికి అప్గన్‌ సైన్యం సిద్ధంగా లేదన్నారు. కాబూల్‌లో పరిణామాలు కలచి వేస్తున్నప్పటికీ బైడెన్‌ నిర్ణయంలో మార్పు ఉండబోదని వివరించారు.