రఘువీరా ఏనాడైనా జిల్లాను పట్టించుకున్నారా?

టిడిపి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి

అనంతపురం,జూన్‌21(జ‌నం సాక్షి): టిడిపి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఓర్వలేక, భవిష్యత్తులో తల్లి, పిల్ల కాంగ్రెస్‌ రాజకీయ సన్యాసులవుతారన్న భయంతో లేని పోని ఆరోపణలు చేస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి మండిపడ్డారు. టిడిపికి కంచుకోటగా ఉన్న జిల్లా పట్ల ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధిని కేంద్రికరిస్తున్నారని తెలిపారు. ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో జిల్లాకు నిధులు ఇస్తున్నారని ఇది సంతోషదాయకం అన్నారు. ఆ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ కానుందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాలువల అనుసంధానం, పూడిక తీత వంటి కార్యక్రమాలతో ప్రతి రైతు పొలానికి నీరు అందించడానికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కరువు ఏర్పడి వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ మొత్తాలను వేరువేరుగా చెల్లించడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇది టిడిపి ప్రభుత్వం పాలనలో చారిత్రాత్మకమైన ఘట్టం అన్నారు. పదేళ్లు పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి రైతులు, ప్రజల డబ్బులను దండుకున్నారని విమర్శించారు. వీళ్లు నేడు ముఖ్యమంత్రిని విమర్శించడం సిగ్గుచేటుగా ఉందన్నారు. రఘువీరా అపద్దాలు చెప్పడంలో దిట్ట అన్నారు. రఘువీరా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా రైతుల గురించి ఏనాడు ఆలోచించలేదని, అలాంటి వారికి ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు లేదన్నారు.