రవాణా పన్ను కట్టాల్సిందే

C
-ఎంట్రీ టాక్స్‌పై రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 10 (జనంసాక్షి)

తెలంగాణలో ప్రవేశించే వాహనాలు రవాణా పన్ను చెల్లించాల్సిందేనని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సరిహద్దుల్లో ప్రవేశించే వాహనాలు తప్పనిసరిగా  పన్ను చెల్లించాలన్నారు. రవాణా పన్ను అంశంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. తైమ్రాసిక పన్నును తనిఖీ కేంద్రాల వద్ద డిపాజిట్‌ చేయాల్సిందేనని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెల్లించిన పన్ను కోసం ప్రత్యేక  ఖాతా నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు వసూలైన పన్ను మొత్తాన్ని వినియోగించొద్దని కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఎంట్రి టాక్స్‌ విషయంలో బస్‌ యజమానులకు ఊరట లభించలేదు. ఇంతకు ముందు హావిూ పత్రం ఇచ్చి బస్‌ లు నడుపుకోవచ్చన్న హైకోర్టు శుక్రవారం నాటి విచారణలో నగదే చెల్లించాలని ఆదేశించింది.అయితే ప్రభుత్వం మాత్రం ఈ నగదును వాడకుండా, ప్రత్యేక ఖాతాలో ఉంచాలని ఆదేశించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై అఫిడవిట్లు ఇవ్వాలని కూడా కోరింది.ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉన్నందున ఎంట్రిటాక్స్‌ వసూలు చేయరాదని బస్‌ యజమానులు కోరుతున్నారు. కాని హైకోర్టు వీరికి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు టాక్స్‌ చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎప్రిల్‌ 1 నుంచి తెలంగాణలో ఎంట్రీ టాక్స్‌ వసూళ్లు మొదలయ్యాయి. విభజన కారణంగా పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని ఉన్నందున పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎపి ట్రాన్స్‌పోర్టర్లు కోరారు. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇతర రాష్టాల్ర మాదిరిగానే తామూ పన్ను వసూలు చేస్తున్నామని తెలంగాణ రవాణశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు.