రసాభాసగా ఆకునూరు గ్రామ సభ
సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య వాగ్వివాదం
ప్రజా సమస్యలపై సీపీఐ నాయకులు వినతి
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 26 : మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరు గ్రామసభ రసాభాసగా మారింది. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ చీపురు రేఖ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో చేసిన పనులపై సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య వాగ్వివాదం జరిగింది. సంతకాలు చేయాలని ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులను సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ సభలో నిలదీశారు. ఈసందర్భంగా అందె అశోక్ మాట్లాడుతూ.. పశువుల ఆసుపత్రి భవనం నిర్మాణం కొన్నేళ్లు గడుస్తున్నా పూర్తి చెయ్యలేదని అన్నారు.
గ్రామంలో హోమియోపతి పున ప్రారంభమైనప్పటికీ శాశ్వత వైద్యులు లేక ప్రత్యేక భవనం లేకపోవడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
వెంటనే నూతన భవనం నిర్మాణం చేపట్టి శాశ్వతంగా వైద్యులను నియమించాలని కోరారు. గ్రామంలో అనేక ప్రమాదాలు, దొంగతనాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పాలకులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను నియంత్రించాలన్నారు. వేరే ప్రాంతానికి తరలించిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తిరిగి గ్రామంలోనే తిరిగి ఏర్పాటు చేయాలని, 1వ వార్డుతో పాటు పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారి దుర్గంధం వెదజల్లుతుందన్నారు. వెంటనే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శి బాలయ్య కు అందజేశారు. ఈసందర్భంగా ఉపసర్పంచ్ బోయిని పద్మ మాట్లాడుతూ ఏప్రిల్ 7న జరిగిన గ్రామ సభలో సర్పంచ్ చేసిన పనులకు ఉప సర్పంచ్ గా సంతకాలు చేశామని, తాము చేసిన అభివృద్ధి పనులకు 4నెలల్లో తీర్మానాలు ఇస్తామని సర్పంచ్ గ్రామ సభ సాక్షిగా తీర్మానం చేశారని, కానీ ఐదు నెలలు గడిచినా నేడు సర్పంచ్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ సంతకాలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పులి బాలయ్య, ఎంపీటీసీ తౌట సుధారాణి, జిల్లా పరిషత్ పాఠశాల హెచ్.ఎం అయిలయ్య, వార్డు సభ్యులు ఎండీ. అహ్మద్, శెట్టె నర్సవ్వ, జక్కు అనిత, ముచ్చాల కనకమ్మ, గ్రామస్తులు బోయిని బాలయ్య, ఘనపురం అంజయ్య, తాటికొండ వెంకట బాల్ చారి,గడిపే బాల్ నర్సయ్య, కోతి పౌలు, బోయిని మల్లేశం, సీతారాములు ఆశా, అంగన్ వాడి,తదితరులు పాల్గొన్నారు.