రహదారులు బాగుపడేనా?

నిజామాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో పలు రహదారులపై ఏళ్ల తరబడి నుంచి మరమ్మతుల ఊసే లేకుండా పోయింది. రహదారులపై గుంతలు ఏర్పడటం, పగుళ్లు వచ్చి డాంబరు లేచిపోయింది. వీటిపై ప్రయాణమంటేనే నరక ప్రాయంగా మారింది. రహదారుల నిర్వహణకు ఏటా కి.విూ రూ.25 వేల చొప్పున నిధులు మంజూరవుతున్నా తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి బిల్లులు లేపుతుండటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. సీఎం ఆదేశాల నేపథ్యంలో 
అధికారులు ఆయా డివిజన్ల వారీగా రహదారులపై సర్వే నిర్వహించి ఎన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాయి, పగుళ్లు వచ్చాయన్నది గుర్తించే పనిలో పడ్డారు. నివేదిక రాగానే వీటిని బాగుచేస్తామని చెబుతున్నారు. ప్రధానంగా కరీంనగర్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి రహదారి రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు నుంచి మాచారెడ్డి వరకూ 25 కి.విూ పరిధిలో గుంతలు ఉన్నాయి. 25 కి.విూ దూరం ప్రయాణానికి గంటకు పైబడి సమయం పడుతోంది. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వరకూ 41 కి.విూ దూరం ఉంది. ఈ పరిధిలో గుంతలు, ఎక్కడ పడితే అక్కడ పగుళ్లు ఉన్నాయి. ఏళ్ల తరబడి నుంచి వీటికి మరమ్మతులు చేయకుండా వదిలేశారు. సిఎం కెసిఆర్‌ ఇటీవల సవిూక్ష చేశాక వీటిపై దృష్టి పెట్టారు. అయితే ఇప్పటికయినా వీటిని సక్రమంగా మరమ్మత్తులు చేస్తారా అన్నది చూడాలి.
……………………..