రాంచీ ఆస్పత్రికి లాలూ

ఎయిమ్స్‌నుంచి డిశ్చార్జ్‌పై లాలూ ఆందోళన
న్యూఢిల్లీ,మే1(జ‌నం సాక్షి): దాణా కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్‌  లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను రాంచీకి తరలించారు. ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్‌ అయిన ఆయనను రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌  సైన్సెస్‌ కు తరలించారు. అక్కడ లాలూను పరిశీలించిన డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జ్‌ అయి రాజధాని ఎక్స్‌ ప్రెస్‌లో రాంచీకి వెళ్తున్న లాలూ యాదవ్‌ ప్రయాణ సమయంలో అనారోగ్యం పాలయ్యారు. దీంతో యూపీలోని కాన్పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. లాలూకు బీపీ, షుగర్‌ పెరిగినట్లు గుర్తించిన వైద్యులు అవసరమైన చికిత్స అందించారు. ఢిల్లీలో ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి సోమవారం  డిశ్చార్జ్‌ అయిన ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మంగళవారం రాంచీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని రాంచీలోని రిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అంబులెన్సులో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌ లాల్‌ మాంఝీ మాట్లాడుతూ… అన్ని విధాలుగా ఆయన ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉంది. అయితే వయసురీత్యా ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
కాగా లాలూ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి సిఫారసు చేశామనీ.. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం మెరుగయ్యిందంటూ తిరిగి రిమ్స్‌కి పంపించారంటూ రిమ్స్‌ పీఆర్వో  ప్రకటించారు. కాగా ఉన్నపళంగా తనను ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి ఎందుకు తరలించారో అర్ధం కావడంలేదంటూ లాలూ పేర్కొన్నారు. చికిత్స మధ్యలో ఉండగానే తనను తరలించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాణా కుంబకోణం కేసుల్లో దోషిగా తేలడంతో ఆయన ప్రస్తుతం రాంచీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మార్చి 29న ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.