రాకెట్ దాడిలో యువ క్రీడాకారుడి మృతి
డమాస్కస్: సిరియాలో మారణహోమం కొనసాగుతూనే ఉంది. తాజాగా రెబెల్ గ్రూపు జరిపిన రాకెట్ దాడిలో ఓ యువ పుట్‌బాల్ క్రీడాకారుడు మృతిచెందాడు. మరో ఏడుగురు క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సిరియా రాజధాని డమాస్కస్ శివారులోని ఓ స్పోర్ట్స్ క్లబ్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో జరిగింది. ఈ సంఘటనలో మృతిచెందినది సమీర్ మహ్మద్ మౌస్సూద్ అనే 12 ఏళ్ల బాలుడిగా గుర్తించినట్లు సిరియన్ ఆర్మీస్ పుట్‌బాల్ టీం అధ్యక్షుడు మోహసీన్ అబ్బాస్ తెలిపారు.మౌస్సూద్,
సిరియన్ ఆర్మీ పుట్‌బాల్ టీం యూత్ లీగ్‌లో ఆడుతున్నాడని, అల్-ఫేయాహా స్పోర్ట్స్ క్లబ్లో వారు శిక్షణ తీసుకుంటున్నాడని వివరించారు. గాయపడిన క్రీడాకారులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో రెబెల్ గ్రూపు ఈ స్పోర్ట్స్ క్లబ్‌పై పలుమార్లు దాడి చేసిందని తెలిపారు. గత మంగళవారం రాజధానిలో రెబెల్ గ్రూపు జరిపిన బాంబుదాడిలో 44 మంది పౌరులు మృతిచెందిన సంగతి తెల్సిందే.