రాజకీయాల్లో అహంకారం పనికిరాదు

3
– మోదీకి అన్నా హెచ్చరిక

ఢిల్లీ 16 జులై  (జనంసాక్షి):

సంపూర్ణ మెజార్టీ ఉందని విర్రవీగుతూ   ఇష్టానుసారం, ఆహంకారంగా      వ్యవహరిస్తే మాత్రం మున్ముందు కష్టాలు తప్పవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే హెచ్చరించారు. ‘వన్‌ ర్యాంక్‌… వన్‌ పెన్షన్‌’ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ మాజీ సైనికోద్యోగులు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలో హజారే కూడా ఆదివారం పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన నరేంద్ర మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాత్రి సమయాల్ల జవాన్లు సరిహద్దుల వద్ద కాపలా ఉండటం వల్లే దేశంలోని ప్రజలంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారని గుర్తుచేశారు. అలాంటి సైనికులకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. సైనికులు గౌరవంగా బతికే అవకాశం లేదా అని నిలదీశారు. కేవలం నాలుగు వేల రూపాయల పెన్షన్‌తో కుటుంబ జీవనం ఎలా చేయగలడని ప్రశ్నించారు.

అంతేకాకుండా, గత ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలో వెనక్కి తగ్గితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సభలో సంపూర్ణ మెజార్టీ ఉందని, మమ్మల్నెవరూ ముట్టుకోలేరని ప్రభుత్వం భావిస్తే… రానున్న ఒక్కోరోజు వారికి సంకటంగానే ఉంటుందని హజారే హెచ్చరించారు. వన్‌ ర్యాంక్‌.. వన్‌ పెన్షన్‌ విధానం అమలు కోసం తానే స్వయంగా అక్టోబర్‌ రెండో తేదీ నుంచి నిరాహారదీక్ష చేయనున్నట్టు హజారే ప్రకటించారు.