రాజకీయాల్లో విలువలకు సమాధి
పదవులే రాజకీయ పరమావధి
విమర్శించిన నేత పంచనే చేరుతున్న నేతలు
హైదరాబాద్,సెప్టెంబర్21(జనంసాక్షి): రాజకీయాల్లో విలువలు లేవని, వ్యక్తులకు పార్టీల పట్ట విశ్వాసం కన్నా పదవులపైనే మోహం ఉందనడానికి తాజా ఉదాహరణ పెద్దిరెడ్డి,మోత్కుపల్లి నర్సింహులు,రమణల ఉదంతాలే. టిడిపిలో అనేక పదవులు అనుభవించి, చంద్రబాబు అడుగలకు మడుగులొత్తి, తెలంగాణను, కెసిఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన వీరంతా తరిగి కెసిఆర్ గూటికి చేరారు. వీరంతా సడన్‌గా యూ టర్న్ తీసుకున్నారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ తెలంగాణ వాడు కాదని, విజయనగరం నుంచి వలస
వచ్చాడని పదేపదే ప్రచారం చేయడంలో మోత్కుపల్లి ముందున్నారు. టిడిపిలో అనేక పదవులు అనుభవించి, రాజకీయంగా ఎదిగి ఆ పార్టీని, దాని అధినేతలను తిట్టాల్సినన్ని తిట్లు తిట్టిన మోత్కుపల్లి తరవాత కొంతకాలానికి బిజెపిలో చేరారు. అలాగే పెద్దిరెడ్డి కూడా చేరారు. రమణ మాత్రం టిడిపిలోనే ఉన్నారు. కానీ సుదూరంలో రాజకీయ ఉనికి కానరాకపోవడంతో కారణాలు చూపుతూ టిఆర్‌ఎస్ పంచనపడ్డారు. కెసిఆర్ కూడా రాజకీయ ఎత్తులు వేస్తూ వీరిని అక్కున చేర్చుకున్నారు. వీరంతా టిఆర్‌ఎస్‌లోకి రావడం వెనక కారణాలు బహిరంగ రహస్యం. రాజ్యసభ సీటు, గవర్నర్ గిరీ ఆశించి భంగపడి, కనీసం టిటిడి బోర్డు మెంబర్ పదవి దక్కకపోవడంతో అప్పుడు టిడిపి అధినేతపై మోత్కుపల్లి అనేక విమర్శలు గుప్పించడం తెలిసిందే. బిజెపిలో చేరాక కూడా అదేపనిని చేశారు. పార్టీ మారదల్చు కుంటే మారాలి. అంతేగానీ వీడుతున్న పార్టీపై విమర్శలు చేస్తే ప్రజలు నమ్మరని మోత్కుపల్లి తదితరులు గుర్తించినట్లు లేదు. చంద్రబాబును విమర్శించి..బయటపడ్డాక ఆయన చేసిన విమర్శలు అప్పట్లో సంచలనం కలిగించి ఉండవచ్చు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించిన మోత్కుపల్లి సమాధిపై వాలిపోయి కన్నీరు పెట్టుకున్న తీరు దొంగ ఏడ్పుల కాక మరోటి కాదు. చంద్రబాబు కుట్రలకే ఎన్టీఆర్ బలయ్యారంటూ ఓ రెండు దశాబ్దాల తరవాత చెబితే నమ్ముతారా అన్నది తెలుసుకోలేక బాబుపై అక్కసు వెళ్లగక్కారు. ఆనాడు మోత్కుపల్లి వ్యాఖ్యలతో పార్టీకి తీవ్రనష్టం జరుగు తోందని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. గవర్నర్ పదవి రాలేదన్న అక్కసుతో తెలంగాణలో పార్టీని బలహీనపర్చాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముందు మోకరిల్లి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని అప్పట్లో ఎల్. రమణ మండిపడ్డారు. అలాంటి రమణ కూడా కెసిఆర్‌పై చేసిన విమర్శలను పక్కన పెట్టి గులాబీ కండువా కప్పుకున్నారు. పెద్దిరెడ్డి కూడా ఇదే బాటలో నడిచారు. రాజకీయాల్లో విమర్వలకు నిబద్దత లేదని రుజువు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదవర్గాలకు పదవులు ఇవ్వడం, ఎస్సీలకు దళితబంధు అమలు చేయడం గొప్ప విషయమం టున్నారు. అలాంటి వీరు రేపు ఎలా రియాక్ట్ అయినా సందేహించాల్సిన అవసరం లేదు. రాజకీయ అవసరార్థం ఎప్పుడు ఏదైనా మాట్లాడే అలవాటు మన రాజకీయ నేతలకు ఉంది.