రాజధానిపై దుర్మార్గపు ఆలోచన ఎందుకు?

– ట్విట్టర్‌లో నారా లోకేశ్‌
అమరావతి, సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మరోసారి విమర్శలు ఎక్కుబెట్టారు. రావాలి సీబీఐ.. కావాలి సీబీఐ అన్న వైఎస్‌ఆర్సీపీ ఇప్పుడు ఎందుకు భయపడుతోందని ఎద్దేవా చేసిన లోకేశ్‌.. సీఎం జగన్‌కు ఎంత లెక్కలేనితనమో అంటూ సెటైర్లు వేశారు. రాజధానికి ప్రపంచబ్యాంక్‌ ఆర్థిక సాయం విషయంలో కేంద్రం దాదాపు నెలరోజులు ఎన్నో లేఖలు రాసిందని, బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని సమాచారమిచ్చిందన్నారు. ఆఖరి క్షణంలో కూడా హెచ్చరించిందని, అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదని లోకేశ్‌ విమర్శలు గుప్పించారు. అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఇది జగన్‌ పన్నిన కుట్ర కాకపోతే ఇంకేంటని లోకేశ్‌ ప్రశ్నించారు. ప్రజలందరూ కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు విూకెవరిచ్చారని నిలదీశారు. విూ సొంత ఇళ్లను వందల కోట్లతో కట్టుకున్న విూరు, రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుత రాజధాని అక్కర్లేదనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారని సీఎం జగన్‌ను ఉద్దేశించి లోకేశ్‌ ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం కోసం రూ.2100 కోట్లను వరల్డ్‌ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని చంద్రబాబు సర్కారు భావించిందని, కాగా వైఎస్‌ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక.. ప్రాధాన్యాలు మారడంతో.. అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్‌ నుంచి వరల్డ్‌ బ్యాంక్‌ తప్పుకుందని, ఈ విషయంలో విూ వైఖరి చెప్పాలని కేంద్రం లేఖలు రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం
స్పందించలేదని లోకేశ్‌ ఆరోపించారు.