రాజన్న సన్నిధిలో సీఎం కేసీఆర్
వేములవాడ, డిసెంబర్,28(జనంసాక్షి) : తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారినిసోమవారం దర్శించుకున్నారు. ఎరవెల్లి ఫాం హౌస్‌లో ఆయుత చండీ యాగం ముగించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సమేతంగా సోమవారం పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామివారలను దర్శించుకున్నారు. ఎరవెల్లి నుండి మధ్యాహ్నం 2.30 గంటలకు వేములవాడ చేరుకున్న కెసిఆర్ ముందుగా స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌బాబు (ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు) నివాసానికి వెళ్ళి పట్టు పంచలు కట్టుకుని కుటుంబ సమేతంగా రాజన్న ఆలయానికి వెళ్ళారు. ఆలయ సాంప్రదాయానుసారం స్థానాచార్య గోపన్నగారి శంకరయ్య, ఇతర అర్చకులు, ఈఓ దూస రాజేశ్వర్‌లు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి గర్భగుడిలోకి తీసుకెళ్ళారు. తూర్పుద్వారం నుంచి రాజన్న ఆలయానికి సీఎం కేసీఆర్ చేరుకుకున్నారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం అద్దాల మంటపంలో సియం దంపతులకు అర్చకులు వేదమంత్రయుక్తంగా ఆశీర్వచనం చేశారు.
అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ : గత ఐదు రోజులుగా ఎరవెల్లిలో చండీయాగం నిర్వహించిన కెసిఆర్ సోమవారం ఉదయం యాగాన్ని ముగించిన అనంతరం పండితుల సూచనల మేరకు వేములవాడలోని శ్రీపార్వతీ రాజరాజేశ్వరీదేవికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్న కెసిఆర్ ఆలయ ధర్మగుండంతో పాటు గుడి చెరువును పరిశీలించి తిరిగి ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. కెసిఆర్ వెంట ఆయన కూతురు, ఎంపి కవిత, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్ట మధు, కెప్టెన్ సతీశ్, రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, సబ్ కలెక్టర్ పౌసుమీబసు, ఓఎస్‌డి సుబ్బారాయుడులతో పాటు పలువురు అధికారులు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.అక్కడ భోజన కార్యక్రమాలు ముగించుకుని హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు.
భక్తుల సౌకర్యాలపై మంత్రి ఈటెల ఆరా
వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు దేవస్థానం తరపున సమకూర్చిన వసతి గదులపై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆరా తీశారు. వేములవాడ రాజరాజేశ్వరీ దేవి సందర్శనార్థం సియం కెసిఆర్ సోమవారం ఆలయానికి రాకముందు మంత్రి ఈటెల, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ తదితరులతో ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయం తరపున లభించే వసతి గదులతో పాటు పట్టణంలోని ప్రైవేటు గదులపై ఈఓ దూస రాజేశ్వర్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ధర్మగుండంలోని నీటిని చూసి ఎప్పటికప్పుడు మార్చి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం నాటి వేములవాడ పర్యటనలో ఆలయ అభివృద్ధిపై అధికారులతో ఎలాంటి సమీక్షా నిర్వహించకుండా వెళ్ళిపోవడం రాజన్న భక్తులతో పాట పట్టణవాసుల్లో నిరాశ, అసంతృప్తి నెలకొంది. లోక కళ్యాణార్థం గత 23 నుండి 27 వరకు ఎరవెల్లిలోని తన ఫాంహౌస్‌లో ఆయుత చండీయాగం నిర్వహించి పలువురి మన్ననలందుకోవడమే గాకుండా ఈ ఐదు రోజులూ ఆయన జరిపిన ఈ చండీ యాగంపై పలు చానళ్ళు, పత్రికలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా యాగ నిర్వహణానంతరం చండీ అమ్మవారిని దర్శించుకున్నట్లయితే యాగఫలం సిద్ధిస్తుందన్న పండితుల సూచనల మేరకు కెసిఆర్ అధికారికంగా ముందుగా ఎలాంటి షెడ్యూల్ లేనప్పటికీ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరీదేవిని దర్శించాలని నిర్ణయించడం, ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులకు సమాచారం అందించడం చకచకా జరిగిపోయాయి. కాగా నిర్ణయించిన షెెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 10-30 గంటలకు వేములవాడకు చేరుకోవాల్సి ఉండగా ఎరవెల్లిలో మిగిలిపోయిన యాగపు పనులలో పాల్గొనడంతో సుమారు 3 గంటలు ఆలస్యంగా ఆలయానికి చేరుకున్నారు. అయితే ఇంతకు ముందే సోమవారం సాయంత్రం రాష్ట్రపతిని కలవడానికి షెడ్యూల్ ఖరారుకావడంతో మధ్యాహ్నం దాదాపు 1-30 గంటలకు రాజన్న ఆలయానికి చేరుకున్న కెసిఆర్ దంపతులు హడావిడిగా స్వామివారిని దర్శించుకుని, శ్రీరాజేశ్వరీదేవికి సట్టువస్త్రాలను సమర్పించి సిద్ధంగా ఉన్న హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో గత జూన్ 18న ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటిసారిగా వేములవాడ పుణ్యక్షేత్రానికి రావడం 5 వందల కోట్లతో రాజన్న ఆలయంతో పాటు పట్టణాభివృద్థిని చేస్తామని హామీ ఇవ్వడం ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌బాబు గత కొన్ని నెలలుగా జిల్లా కలెక్టర్, ఆలయాధికారులు, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, రెవెన్యూ తదితర అధికారులతో కలసి కార్యాచరణ రూపొందించడం చకాచకా జరిగిపోయాయి. అయితే గత జూన్ పర్యటనలో వేములవాడ అభివృద్ధి కొరకు అప్పుడే 100 కోట్లు మంజూరీ చేస్తామని, ప్రాధికార సంస్థ (టెంపుల్ డెవలప్‌మెంట్ అధారిటీ) ను ఏర్పాటుచేసి, సంవత్సరానికి 100 కోట్ల చొప్పున ప్రతి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని, రాజన్న భక్తులకు తగిన సౌకర్యాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ప్రకటించి ఆరు నెలలు కావస్తున్నప్పటికీ నిధుల విడుదలపై ఇప్పటి వరకూ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటనా వెలువడకపోవడం అలాగే ఆలయ, పట్టణాభివృద్ధికి సంబంధించి ఎలాంటి పనులు కూడా ప్రారంభం కాకపోవడం ఈ క్రమంలో సోమవారం రెండోసారి వేములవాడ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి అభివృద్ధిపై మాటమాత్రం కూడా ఎలాంటి సమీక్ష జరపకుండా హడావిడిగా వెళ్ళిపోవడంతో లక్షలాది రాజన్న భక్తులతో పాటు పట్టణ ప్రజలు కెసిఆర్‌పై పెట్టుకున్న ఆశలపై ఒక్కసారిగా నిరాశా నిస్పృహలు ఆవరించాయి.