రాజస్థాన్‌లో గాలివాన బీభత్సం..

– 22మంది మృతి, వందమందికిపైగా గాయాలు
జైపూర్‌, మే3(జ‌నం సాక్షి) : రాజస్థాన్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల బుధవారం అర్ధరాత్రి బలమైన ఈదురుగాలుల కారణంగా 22 మంది మృత్యువాత పడ్డారు. వందమందికి పైగా గాయాల పాలయ్యారు. విపత్తుల నిర్వహణ శాఖ తెలిపిన వివరాలప్రకారం… భరత్‌పూర్‌లో 11మంది, ధోల్‌పూర్‌లో 5మంది, అల్వార్‌లో నలుగురు, ఝన్‌ఝున్‌, బికనేర్‌లో ఒక్కొక్కరు మృతి చెందారు. రౌలీలోని ఓ భవనం గోడ కూలి ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. పలు చోట్ల పెద్ద వృక్షాలు నేల కూలండంతో వందమందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నట్లు స్థానిక ఎస్పీ తెలిపారు. దీనిపై విద్యుత్‌ శాఖ ఇంజినీర్‌ డీపీ సింగ్‌ మాట్లాడుతూ…’ బుధవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం, పిడుగుల కారణంగా 1,000 పైగా విద్యుత్‌ స్తంభాలు నేల కూలాయి. దీంతో పలు చోట్ల చీకటి అలముకొంది. మరమ్మతు పనులు చేపట్టడానికి కనీసం రెండు రోజులు పడుతుంది.’ అని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపింది.